బాలికలకు టీకా తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

బాలికలకు టీకా తప్పనిసరి

Mar 13 2026 9:03 AM | Updated on Mar 13 2026 9:03 AM

బాలికలకు టీకా తప్పనిసరి పంటమార్పిడితో లాభాలు వైద్యులు అందుబాటులో ఉండాలి: ఆర్డీఓ ముగిసిన ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి

నర్సాపూర్‌: బాలికలకు హెచ్‌పీవీ టీకా తప్పనిసరిగా వేయించాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి సూ చించారు. గురువారం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో టీకా కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. హెచ్‌పీవీ వైరస్‌తో గర్భాశయ కేన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని, టీకా తీసుకోవడంతో భవిష్యత్తులో ఆ వ్యాధిని తగ్గించుకోవచ్చని చెప్పారు. ప్రభుత్వం సూచించిన విధంగా 14 నుంచి 15 సంవత్సరాల బాలికలు టీకా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ పావని, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సృజన, ఆర్‌ఎంఓ రాజేష్‌, రెడ్డిపల్లి పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ రఘువరన్‌, కౌన్సిలర్‌ నర్సమ్మ, ఆయా పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మనోహరాబాద్‌(తూప్రాన్‌): రైతులు పంట మార్పిడితో అధిక దిగుబడులు సాధించి లాభాలు పొందవచ్చని మండల వ్యవసాయ అధికారి స్రవంతి అన్నారు. గురువారం మండలంలోని రంగాయపల్లిలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సీజన్‌ను బట్టి పంటలు వేయాలని సూచించారు. శుక్రవారం కూచారం రైతువేదికలో సాయంత్రం 5 గంటలకు జరిగే పీఎం కిసాన్‌ కార్యక్రమానికి హాజరుకావాలని సూచించారు. ఆమె వెంట ఏఈఓ సచిన్‌ ఉన్నారు.

మనోహరాబాద్‌(తూప్రాన్‌): పీహెచ్‌సీలో వైద్యులు అందుబాటులో ఉండి రోగులకు వైద్యం అందించాలని తూప్రాన్‌ ఆర్డీఓ జయచంద్రారెడ్డి ఆదేశించారు. గురువారం మండల కేంద్రంలోని పీహెచ్‌సీ వద్ద పల్లె ప్రగతి పనుల్లో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆస్పత్రి పరిసరాలను శుభ్రం చేయించారు. వైద్యం కోసం వచ్చే వారికి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రీతిరెడ్డి, పీహెచ్‌సీ వైద్యురాలు జ్యోత్స్న దేవి, సర్పంచ్‌ చీర్ల అనూష, ఉపసర్పంచ్‌ వెంకట్‌రెడ్డి, వైద్య బృందం, పంచాయతీ కార్యదర్శి రూపాగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

మెదక్‌ కలెక్టరేట్‌: ఇంటర్‌ మొదటి సంవత్సర పరీక్షలు గురువారంతో ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఇంటర్మీడియెట్‌ విద్యాధికారి మాధవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చివరిరోజు జనరల్‌ విభాగంలో 6,085 గాను 5,895 మంది హాజరు కాగా, ఒకేషనల్‌ విభాగంలో 279 గాను 260 విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. దీంతో హాజరు శాతం 96.71 నమోదైనట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా, సీసీ కెమెరాల ద్వారా పరీక్షలను పర్యవేక్షించినట్లు తెలిపారు.

కౌడిపల్లి(నర్సాపూర్‌): విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సృజన అన్నారు. గురువారం మండలంలోని తునికి వద్ద గల ఎంజేపీ బీసీ మత్స్యకారుల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఆర్‌బీఎస్‌కే ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించి సీపీఆర్‌పై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థులకు మెరుగైన విద్య, వైద్యం అందించేందుకు కృషి చేస్తుందన్నారు. అనారోగ్య సమస్యలుంటే ఉపాధ్యాయులకు, ఏఎన్‌ఎంకు చెప్పాలని సూచించారు. ఈసందర్భంగా పలువురు విద్యార్థులకు మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ హరిబాబు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement