ఆరుతడి.. సాగండి | - | Sakshi
Sakshi News home page

ఆరుతడి.. సాగండి

Mar 13 2026 9:03 AM | Updated on Mar 13 2026 9:03 AM

‘బియ్యం నిల్వలు పెద్దఎత్తున పేరుకుపోయాయి. ఆశించిన మేర ఎగుమతులు లేక గోదాముల్లో ముక్కిపోతున్నాయి. రైతులు ఏడాదికి రెండు పంటలు వరి సాగు చేయటంతోనే ఈ పరిస్థితి నెలకొంది. వారిని ఆరుతడి పంటల వైపు, ముఖ్యంగా ఆయిల్‌పాం సాగు వైపు మళ్లించండి. వచ్చే రబీ నాటికి కనీసం 30 శాతం పంటలు సాగు కావాలి’. ఇటీవల కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో అధికారులతో జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్‌ చేసిన వ్యాఖ్యలు. – మెదక్‌జోన్‌

జిల్లాలో ఈ యాసంగి సీజన్‌లో మొత్తం 2.75 లక్షల ఎకరాల్లో రైతులు అన్నిరకాల పంటలు సాగు చేశారు. వాటిలో 2.33 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, కేవలం 22 వేల ఎకరాల్లో మాత్రమే ఇతర ఆరుతడి పంటలు వేశారు. మొత్తంగా 11 శాతం మేర మాత్రమే సాగు చేశారు. వర్షాకాలం సీజన్‌లో సుమారు 6 లక్షల మెట్రిక్‌ టన్నులు, యాసంగిలో 4 లక్షల పైచిలుకు మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరిస్తున్నారు. ఫలితంగా బియ్యం నిల్వలు భారీగా పేరుకుపోతున్నాయి. వచ్చే రబీ సీజన్‌ నాటికి సాగులో కనీసం 30 శాతం ఆరుతడి పంటల వైపు రైతులను మళ్లించాలని, ప్రధానంగా ఆయిల్‌పామ్‌పై అవగాహన కల్పించాలని మంత్రి వివేక్‌ ఇటీవల ఉమ్మడి మెదక్‌ జిల్లా కలెక్టర్లు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 2 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ పంటలు సాగవుతున్నాయి. అందులో ఈఏడాది 978 ఎకరాల్లో సాగుకు రైతులు ముందుకొచ్చారు. కాగా మరింత సాగు పెరగాలని రైతులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. అలాగే ఈనెల 16న జిల్లా నుంచి 50 మందికి పైగా రైతులను భద్రాచలం తీసుకెళ్లి ఆయిల్‌పామ్‌ సాగుపై అవగాహన కల్పించనున్నారు.

వచ్చే రబీ నాటికి 30 శాతం పెరగాలని ఇటీవల మంత్రి వివేక్‌ ఆదేశం

రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు

ముమ్మర ప్రయత్నాలు

మంత్రి ఆదేశాలతో ఆరుతడి పంటల సాగు వైపు రైతులను మళ్లించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాం. వచ్చే రబీ సీజన్‌ నాటికి 30 శాతానికి పైగా పంట మార్పిడి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. – దేవ్‌కుమార్‌,

జిల్లా వ్యవసాయ అధికారి

7 రోజుల పాటు అవగాహన

‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా మే 4 నుంచి మే 10 వరకు వ్యవసాయ, హార్టికల్చర్‌ శాఖలు సంయుక్తంగా 7 రోజుల పాటు ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. వాటిలో నానో యూరియా పనితీరు, ఆయిల్‌ పామ్‌ సాగు, తుంపరసేద్యం, పందిరి సాగు, పట్టు పురుగుల సాగు, కూరగాయలు, సబ్సిడీపై వ్యవసాయ పరికరాల పంపిణీ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement