దండేపల్లి: జిల్లా సగటు వర్షపాతం సాధారణ స్థాయి కంటే ఎక్కువే నమోదైంది. అన్ని మండలాల్లో అధిక, సాధారణ వర్షపాతం నమోదైనా దండేపల్లి మండలంలో ఇంకా లోటు వర్షపాతమే ఉంది. జిల్లా సగటు సాధారణ వర్షపాతం 572.7 మిల్లీమీటర్లు కాగా ఇప్పటివరకు 665.4 మిల్లీమీటర్లు కురిసింది. సాధారణం కంటే 16 శాతం ఎక్కువగా నమోదై జిల్లా మొత్తం సాధారణ స్థాయికి చేరింది. అత్యధికంగా బెల్లంపల్లి మండలంలో 883.4 మిల్లీమీటర్ల వర్షం కురువగా సాధారణం కంటే 63శాతం ఎక్కువగా నమోదైంది. అత్యల్పంగా దండేపల్లి మండలంలో 392.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా 31శాతం లోటు ఏర్పడి ఏకై క మండలంగా నిలిచింది. బోర్లు, వ్యవసాయ బావులపై ఆధారపడే రైతులను లోటు వర్షపాతం ఆందోళనకు గురిచేస్తోంది. వర్షకాలంలో కీలకమైన జూలై, ఆగస్టు నెలల్లో కురిసే వర్షాలతో వర్షపాతం సాధారణ, అధికం, అత్యధికం నమోదవుతుంటాయి. జూలై నెలాఖరులో, ఆగస్టు ప్రారంభంలో జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలతో చాలా మండలాల్లో వర్షపాత నమోదు పరిస్థితిని మార్చేశాయి. లోటు నుంచి సాధారణ స్థితికి చేరుకోగా, దండేపల్లి మండలంలో ఇప్పటికీ లోటు వర్షపాతమే నమోదు కావడం గమనార్హం. వర్షాలు పడుతాయన్న భరోసాతో బోర్లు, బావుల కింద రైతులు పంటసాగు పనులు ముమ్మరం చేశారు. ఆశించిన వర్షాలు కురువకపోతే సాగునీటికి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. లోటు వర్షపాతం దృష్ట్యా వ్యవసాయ అధికారుల సూచన మేరకే పంటలు సాగు చేయాలని సూచిస్తున్నారు. కొన్ని చోట్ల బోర్లు, బావుల్లో నీళ్లు చాలక పైపులు వేసి పంటలకు నీరందిస్తున్నారు.


