బియ్యం కొను.. గోదాంకు పంపు ! | - | Sakshi
Sakshi News home page

బియ్యం కొను.. గోదాంకు పంపు !

Aug 10 2026 11:48 PM | Updated on Aug 10 2026 11:48 PM

మిల్లర్ల ‘సీఎంఆర్‌’ అప్పగింతలోనూ నేర్పు

వడ్లు అమ్ముకుని ప్రైవేటుగా కొని బాకీ క్లియర్‌

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సీఎంఆర్‌(కస్టం మిల్లింగ్‌ రైస్‌)లో కొందరు మిల్లర్లు నేర్పుతో వ్యవహరిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధి ఎఫ్‌సీఐ, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ(స్టేట్‌ పూల్‌) బియ్యం అప్పగింతలో కొనుగోలు చేస్తున్నారు. ఆయా సీజన్లలో రైతుల నుంచి సేకరించిన ధాన్యం దించుకున్న మిల్లర్లు వెంటనే అమ్మేసుకున్నారు. చాలా చోట్ల ధాన్యం నిల్వలే లేవు. మరోవైపు ప్రభుత్వానికి బాకీ తీర్చాల్సి రావడంతో తప్పని పరిస్థితిల్లోనూ కొంటున్నారు. ఎఫ్‌సీఐకి దొడ్డు బియ్యం, రాష్ట్ర పరిధిలో సన్న బియ్యం కొంటున్నారు. ఇందుకోసం ఎక్కడ తక్కువ ధరకు దొరికితే అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు. గతంలో ఆంధ్రా, పంజాబ్‌తోపాటు ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకున్నారు. ఇప్పుడు బియ్యం ధరలు పెరగడంతోనూ రేషన్‌ బియ్యం సైతం కొందరు రీ సైక్లింగ్‌ చేసేందుకు వెనుకాడడం లేదు. సోమవారం బియ్యం రీ సైక్లింగ్‌ జరుగుతోందనే ఫిర్యాదు మేరకు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు జైపూర్‌ మండలం టేకుమట్లలో ఉన్న మంజునాథ రైస్‌మిల్లులో సంయుక్తంగా తనిఖీలు చేశారు. సోమవారం బియ్యం లోడుతో ఓ లారీ రైస్‌మిల్లుకు చేరుకుందనే సమాచారం అధికారులకు అందింది. తనిఖీలు చేపట్టిన అధికారులు సిద్దిపేట నుంచి 30టన్నుల దొడ్డు బియ్యం ఉన్నట్లు గుర్తించారు. అయితే ప్రస్తుతం సన్న బియ్యం పంపిణీ జరుగుతోంది. ఈ క్రమంలో దొడ్డుబియ్యంతో రేషన్‌ బియ్యం రీ సైక్లింగ్‌ జరిగే ఆస్కారం లేదు. అయినప్పటికీ ఆ బియ్యాన్ని ల్యాబ్‌కు పంపి పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎఫ్‌సీఐ గత ఖరీఫ్‌ సీజన్‌ సంబంధించిన సీఎంఆర్‌(కస్టం మిల్లింగ్‌ రైస్‌) సేకరణ జరుగుతోంది. ఈ క్రమంలో సదరు రైస్‌మిల్లర్‌ ప్రైవేటుగా మార్కెట్‌లో కొనుగోలు చేసి బియ్యం పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మిల్లులో గత సీజన్‌లో వడ్లు లేకున్నా ట్యాగింగ్‌ ఇస్తూ అధికారులు ఉదాసీనతను చాటుకున్నారు.

రైతుల నుంచి సేకరించిన ధాన్యం మరాడించి గడువులోపే ఆయా సీజన్ల వారీగా బియ్యం అప్పగించాల్సి ఉన్నా చాలామంది ధాన్యం మాయం చేశారు. వీటిలో ఇప్పటికే క్రిమినల్‌ కేసులు, ఆస్తుల అటాచ్‌ చేశారు. మిగిలిన చాలా మిల్లుల్లోనూ ఽవడ్లే లేవు. ఒక క్వింటాల్‌ ధాన్యానికి 67కిలోల వరకు బియ్యం అప్పగించాలి. తమకు అవుట్‌టర్న్‌(బియ్యం నూర్పిడి శాతం) రావడం లేదని బయటి నుంచి కొనుగోలు చేస్తున్నామని అధికారులకు చెబుతూ అనుమతి పొందుతున్నారు. వాస్తవానికి బియ్యం కొనుగోలు చేసి ప్రభుత్వానికి అప్పగించడం చట్ట విరుద్ధం. ఒక వేళ వడ్లు సరిపడా లేక బియ్యం తక్కువగా ఉంటే మొత్తం విలువలో 5నుంచి 10శాతం తక్కువగా ఉండాలి. కానీ చాలా మిల్లులో సగం వరకు బియ్యం కొనుగోలు చేస్తున్నారు. ఇందుకు అధికారులు సైతం సహకరిస్తున్నారు. దీంతో వడ్లు అమ్ముకోవడం, బియ్యం కొని పెట్టడం జిల్లా మిల్లర్లలో సర్వ సాధారణంగా మారింది. ఇలాంటి బియ్యంతో రేషన్‌ నాణ్యత లోపం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement