మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని హైటెక్‌సిటీ రోడ్లు గుంతలుగా మారి వర్షపు నీటితో నిండాయి. దీంతో బీజేపీ మహిళా మోర్చా నాయకులు సోమవారం రోడ్లపై ఉన్న గుంతల్లోని బురదలో వరినా ట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పచ్చ స్వప్నరాణి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో అప్పటి డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ హైటెక్‌సిటీలోని రోడ్లపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా హైటెక్‌సిటీ రోడ్ల పరిస్థితి ఇప్పటికీ అలాగే ఉందని, మాజీ డీసీసీ అధ్యక్షురాలు ఎమ్మెల్యేకు చెప్పి రోడ్లు ఎందుకు వేయించడం లేదని ప్రశ్నించారు. రోడ్లపై వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఉందని, నడిచి వెళ్లే వారికి బురద కష్టాలు తప్పడం లేదని తెలిపారు. అధికారులు స్పందించి రోడ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. నాయకురాళ్లు కొండవీటి తిరుమల, బైరం లక్ష్మి, తూటి సరస్వతి, జిట్టవేణి రేణుక, దాసరి పద్మ, సృజన, సుకన్య పాల్గొన్నారు.


