
చట్టప్రకారం నడుచుకుంటేనే సహకారం
● అటవీ భూములు సాగు చేస్తే చర్యలు ● కలెక్టర్ కుమార్ దీపక్
దండేపల్లి: గిరిజనులు చట్టప్రకారం నడుచుకుంటేనే సహకారం అందించి జీవనోపాధి కల్పిస్తామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మండలంలోని లింగాపూర్ అటవీ బీట్‌లో కొద్ది రోజులుగా సమీప గ్రామాల గిరిజనులు చెట్ల పొదలు తొలగించి సాగుకు ప్రయత్నిస్తున్నారు. అటవీ, పోలీసు అధికారులు నచ్చజెప్పినా వినిపించుకోవడం లేదు. దీంతో వారందరితో మాట్లాడేందుకు మంగళవారం కలెక్టర్ కుమార్ దీపక్ డీఎఫ్‌ఓ శివ్‌ఆశిష్‌సింగ్, డీసీపీ భాస్కర్‌తో కలిసి తాత్కాలిక గుడిసెల్లో ఉంటున్న గిరిజనుల వద్దకు వెళ్లారు. కలెక్టర్ మాట్లాడుతూ 2005కంటే ముందు పోడు వ్యవసాయం చేసుకుంటూ అందుకు తగిన ఆధారాలున్న వారికి మాత్రమే పోడు పట్టాలు ఇస్తామని తెలిపారు. ఆ తర్వాత అక్రమంగా అటవీ భూముల్లో చెట్లు తొలగించి సాగు ప్రయత్నాలు చేసే వారికి ఎలాంటి పట్టాలు ఇవ్వబోమని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆక్రమిత అటవీ భూముల్లో వెదురు, పండ్లతోటలు పెంచుకునే అవకాశం కల్పిస్తామని, మొక్కలు నాటి సంరక్షించినందుకు కూలి చెల్లించడంతోపాటు వాటిని విక్రయిస్తే వచ్చే ఆదాయాన్ని సంబంధిత గిరిజనులకే చెందేలా చూస్తామని అన్నారు. కొందరు గిరిజనులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడంతో కలెక్టర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఎఫ్‌వో, డీసీపీ సూచించారు. గిరిజనులు ఆలోచించి అభిప్రాయాన్ని తెలియజేయాలని అన్నారు. ఏసీపీ ప్రకాశ్, తహసీల్దార్ రోహిత్‌దేశ్‌పాండే, సీఐ రమణమూర్తి, ఎస్సైలు తహాసీనొద్దీన్, సురేష్, అనూష, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు. కాగా, గిరిజనులతో మాట్లాడేందుకు అధికారులంతా అడవిలో కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్లారు.