
ప్రజలు ఆందోళన చెందవద్దు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. శని వారం గుడిపేట శివారులోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ను కలెక్టర్ కుమార్ దీపక్ ప్రాజెక్ట్ అధికారులతో కలిసి సందర్శించారు. వరదలు, వర్షాలకు సంబంధించి అత్యవసర సేవలకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం నంబర్ 08736–250501లో సంప్రదించాలని తెలిపారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లోలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. కడెం ప్రాజెక్ట్ నుంచి భారీ నీటి విడుదలతో వరద ఉధృతి పెరిగే అవకాశంతోపాటు రానున్న 36 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు ఉన్నందున రెడ్ అలర్ట్‌గా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. 90 మంది సభ్యులతో కూడిన 3 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, గజ ఈతగాళ్లు అందుబాటులో ఉన్నారని తెలిపారు. లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ముందస్తుగా పునరావాస ఏర్పాట్లు సిద్ధం చేశామని తెలిపారు. ఎల్లంపల్లి డీఈ బుచ్చిబాబు, హాజీపూర్ తహశీల్దార్ శ్రీనివాసరావుదేశ్‌పాండే ఉన్నారు. కాగా, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గేట్లు తెరుస్తున్నారనే సమాచారం తెలియడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది.
దెబ్బతిన్న రోడ్డు పరిశీలన
కోటపల్లి: మండలంలోని లింగన్నపేట–ఎదులబంధం గ్రామాల మధ్య తుతుంగ వాగు ఉధృతికి రోడ్డు దెబ్బతిని పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కలెక్టర్ శనివారం సందర్శించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరద ఉధృతి తగ్గిన తర్వాత రోడ్డు మరమ్మతు చేయాలని ఆర్‌అండ్‌బీ ఆధికారులను అదేశించారు.