
ఘనంగా వాజ్‌పేయి వర్ధంతి
చెన్నూర్: చెన్నూర్ బీజేపీ కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్ బిహరీ వాజ్‌పేయి వర్ధంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశ ప్రధానిగా చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు తుమ్మ శ్రీపాల్, నాయకులు బత్తుల సమ్మ య్య, కొండపాక చారి, జాడి తిరుపతి, ఎతం శివకృష్ణ, కేవీఏం శ్రీనివాస్, వెంకటనర్సయ్య, మంచాల రాజబాపు పాల్గొన్నారు.
కేకే–5 గనిలో
మాక్ రిహార్సల్
మందమర్రిరూరల్: రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మందమర్రి ఏరియాలోని గనుల్లో పనులు కొంతమేరకు స్తంభించాయి. శనివారం కేకే–5 గని పైభాగంలో పాలవాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహించింది. దీంతో గని అధికారులు మొదటి షిఫ్టు కార్మికులకు పలు సూచనలు చేశారు. సుమారు గంట సేపు గనిలో రక్షిత ప్రదేశానికి చేర్చి.. గనిలోకి వాగు నీరు ప్రవేశిస్తే తీసుకోవాల్సి న రక్షణ చర్యలపై మాక్ రిహార్సల్ ద్వారా వివరించారు. వరద గనిలోకి వస్తే సైరన్ మోగిస్తారని గని ఏజెంట్ రాంబాబు, మేనేజర్ శంభునాథ్ పాండే తెలిపారు. సుమారు 30ఏళ్ల క్రితం పాలవాగు వరద ఉధృతికి రంధ్రం ఏర్పడి గనిలోకి వరదనీరు ప్రవేశించింది. అప్పుడు అధికారులు కార్మికులను అప్రమత్తం చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కాగా, వరద తీవ్రతను గమనించేందుకు పర్యవేక్షణ అధికారిని ఏర్పాటు చేశారు.