
‘ఇన్‌స్పైర్’ అయ్యేదెలా..!
జూలై ఒకటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
335 పాఠశాలల్లో 25 స్కూళ్ల నుంచే నామినేషన్లు
వచ్చే నెల 15తో ముగియనున్న గడువు
మంచిర్యాలఅర్బన్: బాలల ఆలోచనలకు పదును పెడితే అద్భుతం ఆవిష్కృతమవుతుంది. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఏటా కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ మండలి నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా ఇన్‌స్పైర్ మనక్ పేరిట విజ్ఞాన మేళా నిర్వహిస్తోంది. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉంది. 2025–26 విద్యాసంవత్సరానికి ఇన్‌స్పైర్ పోటీలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు, కస్తూర్భా, గురుకుల విద్యాలయాల్లో ఆరు నుంచి 10వ తరగతి విద్యార్థులు పాల్గొనే అవకాశం ఉన్నా స్పందన కరువైంది. జిల్లాలో 335పాఠశాలలు ఉండగా ఇప్పటివరకు 26 స్కూళ్ల నుంచి 115 ప్రాజెక్టుల నామినేషన్లు మాత్రమే వచ్చాయి. జూలై ఒకటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా, వచ్చే నెల 15తో గడువు ముగియనుంది. విద్యార్థుల ప్రతిభకు గుర్తింపు తీసుకొచ్చేందుకు చక్కని మార్గమైనా నామినేషన్లు అంతంత మాత్రమే వచ్చాయి. నిర్ధిష్ట గడువులోగా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు స్పందిస్తేనే విద్యార్థులకు మేలు జరుగుతుంది.
పాఠశాలకు ఐదు చొప్పున
ప్రతీ పాఠశాల నుంచి తరగతికి ఒకటి చొప్పున ఐదు ప్రాజెక్టులు తయారు చేయాలని డీఈవో ఆదేశాలు జారీ చేశారు. ఆన్‌లైన్‌లో ఇన్‌స్పైర్ మనక్ కాంపిటీషన్ యాప్‌లో ప్రదర్శనకు సంబంధించిన వీడియో, ఆడియో, ఫొటోలు, పూర్తి వివరాలు అప్‌లోడ్ చేయాలి. జిల్లా స్థాయి ప్రదర్శన ఆన్‌లైన్‌లోనే న్యాయ నిర్ణయ ప్రక్రియ పూర్తి కానుంది. ఇక్కడ ఎంపికై న విద్యార్థులు రాష్ట్ర స్థాయికి అక్కడి నుంచి జాతీయ స్థాయిలో పాల్గొనే అవకాశం ల భిస్తుంది. మొదట విద్యార్థులు రూపొందించిన ప్రా జెక్టులను నిపుణులు పరిశీలించి జిల్లా స్థాయి ప్రదర్శనకు ఎంపిక చేస్తారు. ఇలా ఎంపికై న ఒక్కో ప్రాజెక్టుకు రూ.10వేల చొప్పున ప్రోత్సాహకం విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటి జాతీయ స్థాయికి ఎంపికై తే రూ.25వేలు, జాతీయ స్థాయిలోనూ ప్రతిభ చూపితే రాష్ట్రపతి భవన్, జపాన్ సందర్శనకు అవకాశం కల్పించే వీలుంది. ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రాజెక్టులు నమోదవుతున్నా ప్రైవేటు పాఠశాలల నుంచి ఆదరణ లేకుండా పోయింది. ఉపాధ్యాయుల పదోన్నతులు, అవగాహన లేమితో కొంతమేర ఇన్‌స్పైర్‌కు అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది.
బడిలో ఐడియా బాక్స్..
పాఠశాలల్లో దరఖాస్తుల స్వీకరణకు ఐడియా బాక్స్ ఏర్పాటు చేశారు. విద్యార్థుల్లో ఇన్‌స్పైర్‌పై అవగాహన కల్పించి వారి సృజనాత్మక ఆలోచనలు రాసి ఐడియా బాక్స్‌లో వేయాలి. స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో భౌతిక, రసాయనశాస్త్ర, జీవశాస్త్ర, గణిత, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులకు నాణ్యమైన ఆవిష్కరణలపై శిక్షణ ఇచ్చారు. టీచర్లు విద్యార్థులు ఐడియా బాక్స్‌లో వేసిన ప్రాజెక్టు ఆలోచనలకు తుది మెరుగులు దిద్ది ప్రాజెక్టు రూపేణ తీసుకు రావాల్సి ఉంది. నెలన్నర గడుస్తున్నా ఆశించిన మేర నామినేషన్ల దరఖాస్తులు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.
గడువులోపు వచ్చేలా చర్యలు
విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ఏటా ఇన్‌స్పైర్ మనక్ అవార్డు పోటీలు నిర్వహిస్తోంది. దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. నిర్ధిష్ట గడువులోగా అధిక దరఖాస్తులు వచ్చేలా విద్యాశాఖ ఆధ్వర్యంలో చర్యలు చేపడుతాం. విస్తృ త ప్రచారం చేపట్టడం, మరోసారి టీచర్లకు అవగాహన కల్పించి కొత్త ఆవిష్కరణలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా చొరవ చూపి విద్యార్థుల్లో ఆసక్తి కలిగించేలా కృషి చేస్తాం.
– రాజగోపాల్, జిల్లా సైన్స్ అధికారి