
యూరియా వస్తోంది!
చెన్నూర్: ఖరీఫ్‌లో పంటలు సాగు చేసిన రైతులు ఎరువుల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. వ్యవసాయ పనులు మానుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. నియోజకవర్గంలో వారం రోజులుగా ఎరువుల కొరత తీవ్రంగా ఉంది. రెండు వందల బస్తాల ఎరువులు వస్తే మూడు వందల మంది రైతులు బారులు తీరుతున్నారు. చెన్నూర్, కోటపల్లి మండలాల్లో ఎరువుల కోసం రైతులు పడుతున్న కష్టాలపై కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరా తీసినట్లు తెలిసింది. రెండు మండలాలకు సరిపడా ఎరువులు పంపించాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో చెన్నూర్, కోటపల్లి మండలాలకు 120 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. చెన్నూర్, కోటపల్లి, పారుపల్లిలో కేంద్రాలను ఏర్పాటు చేసి సోమవారం ఎరువులు పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఏ ప్రాంత రైతులకు ఆ ప్రాంతంలోనే ఎరువులు పంపిణీ చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని అధికారులు సూచిస్తున్నారు.
మూడు కేంద్రాల్లో పంపిణీ
మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో 120 మెట్రిక్ టన్నుల యూరియా వస్తోంది. చెన్నూర్, కోటపల్లి మండలాల్లో మూడు పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. చెన్నూర్‌లో 40, కోటపల్లిలో 40, పారుపల్లి సెంటర్‌లో 40 మెట్రిక్ టన్నుల చొప్పున సోమవారం రైతులకు యూరియా పంపిణీ చేస్తాం. నాలుగు రోజుల తర్వాత సెంటర్‌కు 20 మెట్రిక్ టన్నుల చొప్పున ఎరువులు అందజేస్తాం.
– బానోత్ ప్రసాద్, ఏడీ అగ్రికల్చర్, చెన్నూర్