చెన్నూరులో వరదలై పారుతున్న డబ్బు.. ఒక్క వీధిలో ఉన్నవారి కోసమే రూ.2 లక్షల ఖర్చు!

- - Sakshi

ఓ పార్టీ అభ్యర్థి మందమర్రి మండలం ఊరు రామకృష్ణాపూర్‌లో తన బలం పెంచుకునేందుకు 30 మందికోసం రూ.2లక్షలు ఖర్చు చేశాడు. దీంతో ఆ అభ్యర్థికే వారు జై కొట్టడం ప్రారంభించారు. పార్టీ కండువాలు కప్పుకొని రోజువారీగా ప్రచారం చేస్తున్నారు. ఓ వాడలో 30 మందిని మాత్రమే తనవైపు తిప్పుకొనేందుకే సదరు అభ్యర్థి అక్షరాల రూ.2లక్షలు ఖర్చు చేయడం విశేషం.

ఇదీ ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానమైన చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓ అభ్యర్థి చేసే ఎన్నికల ఖర్చుకు చిన్న ఉదాహరణ.

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అసెంబ్లీ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనంతగా అత్యంత ఖరీదుగా మారాయి. జిల్లా పరిఽధిలో నాలుగు అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో మంచిర్యాల జనరల్‌, బెల్లంపల్లి, చెన్నూరు ఎస్సీ, ఖానాపూర్‌ (జన్నారం) ఎస్టీ రిజర్వ్‌డ్‌ స్థానాలుగా ఉన్నాయి. సాధారణంగా జనరల్‌ స్థానంలో బలమైన నాయకులు పోటీలో ఉంటే అధికంగా డబ్బు ఖర్చు చేస్తుంటారు. అయితే ఈసారి ఇందుకు భిన్నంగా జనరల్‌ స్థానం కన్నా బెల్లంపల్లి, చెన్నూరు ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానాల్లోనూ విచ్చలవిడిగా డబ్బు ప్రవాహం పెరిగింది. పోటీలో ఉన్నవారు ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలవాలనే లక్ష్యంతో ముందుకెళ్తుండగా ఎన్నికలు చాలా ఖరీదవుతున్నాయి. ధనబలమున్న గడ్డం సోదరులైన మాజీ మంత్రి వినోద్‌, మాజీ ఎంపీ వివేక్‌ రంగ ప్రవేశంతో ఎన్నికలు మరింత ప్రియమైపోయాయి.

బీఆర్‌ఎస్‌ బలం తగ్గకుండా..
చెన్నూర్‌, బెల్లంపల్లి కాంగ్రెస్‌ అభ్యర్థులైన గడ్డం సోదరులకు దీటుగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, దుర్గం చిన్నయ్య ఖర్చు చేయడంలో పోటీ పడుతున్నారు. ప్రచారం, నాయకులు, కార్యకర్తల చేరికలు, బహిరంగసభలు, సమావేశాలు, ర్యాలీలు కార్యక్రమాలు పోటాపోటీగా సాగుతున్నాయి. ఇటీవల సీఎం కేసీఆర్‌ బహిరంగసభలు విజయవంతం చేసేందుకు రూ.కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. దీంతో అధికార పార్టీ అభ్యర్థులకూ ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. ప్రతిరోజూ ప్రత్యర్థులకు ఏ మాత్రం తగ్గకుండా కార్యక్రమాలు చేయడమో.. అంతకంటే భారీగా ప్లాన్‌ చేయడం కోసమో నోట్ల కట్టలు విప్పాల్సి వస్తోంది. మంచిర్యాల నియోజకవర్గం కంటే ఈ రెండు చోట్ల కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఖర్చు పోటాపోటీగా నడుస్తోంది.

బీజేపీ అభ్యర్థుల హైరానా
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఎన్నికల్లో ఓట్లు రాల్చేందుకు రూ.కోట్లు ఖర్చు చేస్తుంటే బీజేపీ అభ్యర్థులు హైరానా పడుతున్నారు. చెన్నూరు టికెట్‌ తెచ్చుకున్న దుర్గం అశోక్‌, బెల్లంపల్లిలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి ఆ రెండు పార్టీలతో డబ్బుల్లో పోటీపడలేకపోతున్నారు. అయినప్పటికీ తమ స్థాయికి మించి ఖర్చు చేసేందుకు వెనుకాడడం లేదు. పోటీలో ఎక్కడ వెనుకబడిపోతామనే భయంతో చేతి చమురు వదులుకోవాల్సి వస్తోంది. ఇక బీఎస్పీ, స్వతంత్రులుగా పోటీ చేస్తున్నవారైతే ఈ ఖర్చు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. పోటీ పడలేక, పోటీ నుంచి తప్పుకోలేక ఇబ్బందిగానే ముందుకు సాగుతున్నారు.

రోజుకు రూ.లక్షల్లోనే ఖర్చు
తెల్లవారు మొదలు పొద్దుగుంకేదాకా ప్రచారమంతా ఖర్చుతోనే నడుస్తోంది. ర్యాలీలు, బహిరంగ సభలకు జనసమీకరణ, రవాణా, భోజనాలు, మద్యం, ఊరూరా ప్రచార రథాలు, ప్రకటనలు, కరపత్రాలు, కండువాలు, బహిరంగ సభలు, వసతులు తదితర వాటి కోసం రూ.లక్షల్లోనే ఖర్చవుతోంది. ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతీ అభ్యర్థి రూ.40లక్షల్లోపే ఖర్చు పరిమితి ఉంది. అయితే ఆ పరిమితి వాస్తవానికి ఎప్పుడో దాటిపోయింది. ఇతర పార్టీల నాయకులు తాము పార్టీ మారేందుకు ‘బేరసారాలు’ మొదలుపెట్టాక ఈ ఖర్చు మరింత పెరిగిపోయింది. నామినేషన్ల ఉపసంహరణలోనూ డబ్బు ప్రవావం ఉంటోంది. ఇక పోలింగ్‌ సమీపించే కొద్దీ ఈ నోట్ల ప్రవాహం మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు అభ్యర్థుల ఖర్చుపై పకడ్బందీ నిఘా పెడితే ఎన్నికల్లో డబ్బు ప్రవాహానికి అడ్డుకట్ట పడనుంది.

Read latest Mancherial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top