వాకింగ్‌కు వెళ్లి తిరిగిరాని లోకాలకు..
మంచిర్యాల(క్రైం): వాకింగ్ వెళ్లిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై మజారొద్దీన్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని ఆర్‌ఆర్‌ఆర్ నగర్‌లో నివాసం ఉంటూ కుమురంభీం జిల్లా సిర్పూర్(టి)లో పోస్ట్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీరాంబట్ల నాగేందర్ శర్మ (58) ఈ నెల 3న సాయంత్రం ఏసీసీ రోడ్ వైపు వాకింగ్‌కు వెళ్లాడు. ఇంటికి తిరిగివస్తుండగా గడ్పూర్ వైపు నుంచి అతివేగంగా వచ్చిన ఆటో డీమార్ట్ సమీపంలో ఢీకొట్టింది. తీవ్రగాయాలు కావడంతో ముందుగా ప్రభుత్వ ఆసుపత్రికి, మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తరలించగా పరిస్థితి విషమించి ఆదివారం మృతి చెందాడు. మృతునికి భార్య శీలా, కుమారుడు అక్షయ్, కుమార్తె నికిత ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.


