వామ్మో చైనా మాంజా!
మంచిర్యాలక్రైం: సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో గాలిపటాలు ఎగురవేసేందుకు ఉపయోగించేందుకు చైనా మాంజా విక్రయాలు జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నాయి. నిషేధిత చైనా మాంజా వల్ల కొందరు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు తీవ్రంగా గాయపడడం వంటి ఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి. తాజాగా జిల్లా కేంద్రం మంచిర్యాలలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో మూడు రోజుల క్రితం చెన్నూర్ మండలం గంగారం గ్రామానికి చెందిన మధుకర్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా చైనా మాంజా పెదాలపై తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. అప్రమత్తమై ద్విచక్ర వాహనాన్ని నిలిపి వేయడం వల్ల ప్రమాదం తప్పింది. ఈ ఘటన జరిగిన మూడు రోజులు కావస్తున్నా జిల్లా పోలీసు యంత్రాంగం, అటవీశాఖ అధికారుల్లో కదలిక లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. చైనా మాంజాపై నిషేధం ఉన్నప్పటికీ కొందరు వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా విక్రయిస్తున్నారు. పక్షులు, ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారికి ప్రమాదాలకు కారణం అవుతున్నారు. 2022 జనవరి 16న పాతమంచిర్యాల రాళ్లవాగు బ్రిడ్జిపై చైనా మాంజా తగిలి వలస కూలీ పస్తం భీమయ్య మృతిచెందాడు. ప్రతీ ఏడాది పండుగకు కొద్ది రోజుల ముందు పోలీసు శాఖ అడపాదడపా దాడులు నిర్వహించి మమ అనిపిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు దాడులు నిర్వహించిన దాఖలా లు లేవు. యథేచ్ఛగా విక్రయాలు సాగుతున్నా అధికారుల దాడుల్లో లభించకపోవడం గమనార్హం. పండుగకు నెల రోజుల ముందే వ్యాపారులు అక్రమంగా దిగుమతి చేసుకుంటున్నట్లు సమాచారం.
‘మామూలు’గా వ్యవహరిస్తున్న అధికారులు
సంక్రాంతి పండుగకు ముందు నుంచే వరుస దాడులు నిర్వహించాల్సి ఉండగా పోలీసు, అటవీ శాఖ అధికారులు సమన్వయ లోపంతో దాడులు చేయ డం లేదనే విమర్శలున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు విక్రయదారులపై కేసులు నమోదు చేసిన దాఖలా లు లేవు. ముందుగానే వ్యాపారులు అధికారులతో ములాఖత్ అయి ఎంతో కొంత ముట్టజెప్తున్నారనే ఆరోపణలున్నాయి. ‘‘ఏమవుతుంది.. కేసులు అయితే చిన్న చిన్న కేసులే కదా..’’ అంటూ జిల్లా కేంద్రంలోని ఓ వ్యాపారి వ్యాఖ్యానించారంటే అధికారులపై ఎంత భరోసా ఉందో అర్థమవుతోంది.
వినియోగిస్తే ఏడేళ్ల జైలు
గాజు పూత పూసిన చైనా మాంజాను వినియోగిస్తే పక్షులు, జంతువులు, ద్విచక్ర వాహనదారులు, పతంగులు ఎగురవేసే వారికి సైతం ప్రాణహాని కలిగే అవకాశం ఉంటుందని వన్యప్రాణి ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థల అభ్యర్థన మేరకు తెలంగాణ ప్రభుత్వం 2017 జూలై 17న నిషేధం విధించింది. వినియోగించిన వారికి ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా అమలు చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పర్యావరణ రక్షణ యాక్ట్ 1986, ప్రివెన్షన్ క్రూయాల్టీ టు ఎనిమల్స్ యాక్ట్ 1960 ప్రకారం చట్టపరమైన చర్యలు అమలులో ఉండగా చైనా మాంజా జిల్లాకు ఎలా వస్తుందనేది మిస్టరీగా మారింది.
వామ్మో చైనా మాంజా!


