జిల్లా కార్మిక శాఖలో కాసుల కక్కుర్తి | - | Sakshi
Sakshi News home page

జిల్లా కార్మిక శాఖలో కాసుల కక్కుర్తి

Jan 7 2026 7:52 AM | Updated on Jan 7 2026 7:52 AM

జిల్లా కార్మిక శాఖలో కాసుల కక్కుర్తి

జిల్లా కార్మిక శాఖలో కాసుల కక్కుర్తి

● బాధిత కుటుంబాల నుంచి వసూళ్లు ● కొత్త కార్డు నుంచి పరిహారం చెల్లింపుల దాక ● అన్నింటా పైసలిస్తేనే దరఖాస్తు ముందుకు

న్నారం మండలం కిష్టాపూర్‌కు చెందిన ఓ కార్మికుడు గత ఏడాది మరణించగా కార్మిక శాఖ నుంచి పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నారు. మధ్యవర్తులు రంగ ప్రవేశం చేసి రూ.30వేలు ఇస్తే పని చేస్తామని చెప్పారు. అంత ఇచ్చుకోలేమని చెబితే పరిహారం రూ.2లక్షల్లో తమకు రూ.30వేలు ఇస్తామని ఓ ప్రమాణ పత్రం రాసి ఇవ్వమని అడిగారు. దీనిపై బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే కొన్ని రోజులు పెండింగ్‌లో పెట్టారు. చివరకు తమకు తెలిసిన వారితో వెళ్తే రూ.10వేలు తీసుకుని పరిహారం అందేలా పని చేసి పెట్టారు.

ర్కేపీకి చెందిన ఒకరు చనిపోతే.. కార్మిక శాఖ నుంచి పరిహారం పొందాలని గోదావరిఖనికి చెందిన ఓ వ్యక్తికి ఫోన్‌ చేస్తే రూ.30నుంచి రూ.40వేల వరకు ఖర్చవుతుందని, మృతుని అన్ని పత్రాలు ఉంటే ఒకలా, లేకపోతే మరోలా ఉంటుందని చెప్పారు. పరిహారం పెంచినప్పటి నుంచి థర్డ్‌ పార్టీ వెరిఫికేషన్‌ జరుగుతుందని, ఇదంతా పైసలిస్తేనే పని అవుతుందని వివరించాడు.

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కార్మిక శాఖలో కాసుల కక్కుర్తి ఆగడం లేదు. కొత్తగా కార్మిక కార్డు నుంచి రెన్యూవల్‌, పరిహారం వరకు పైసలు ఇస్తేనే పని జరుగుతోంది. గత జూలైలో ఒకేసారి జిల్లాలో ఇద్దరు కార్మిక శాఖ అధికారులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. అయినా ఆ శాఖ సిబ్బంది అదే తీరుగా వసూళ్లు చేస్తుండడం గమనార్హం. జిల్లాలో మంచిర్యాల–1, 2, బెల్లంపల్లి సర్కిళ్లలో సుమారు 65వేల మంది రిజిష్టర్డ్‌ కార్మికులు ఉన్నారు. ఐదేళ్లకోసారి గుర్తింపు కార్డులు రెన్యూవల్‌ చేసుకోవాల్సి ఉన్నా చేసుకోవడం లేదు. ప్రస్తుతం 45వేలకు పైగా కార్మికులే ఉన్నారు. అధికంగా భవన నిర్మాణ రంగం వారితోపాటు మిగతా వివిధ రంగాల్లో పని చేస్తున్న కార్మికులు కూడా ఉన్నారు. గుర్తింపు పొందిన కార్మికులకు వారి పిల్లలు చదువుకునేందుకు స్కాలర్‌షిప్పులు, ఆడపిల్లల పెళ్లి, మెటర్నిటీ కోసం రూ.30వేల నగదుతోపాటు కార్మికులు ప్రమాదాలతో వైకల్యం, సహజ మరణం చెందినా, వారికి ఆస్పత్రి, దహన సంస్కారాలకు ఆర్థిక సాయం వంటి పలు ప్రయోజనాలు ఉంటాయి. కార్మికులు తమ వాటా కొంత చెల్లిస్తే కార్మిక సంక్షేమ బోర్డు ఈ మేరకు ప్రయోజనాలు అందిస్తుంది.

పరిహారం పెంచడంతో..

గతంలో గుర్తింపు కార్డు ఉన్న కార్మికుడు చనిపోతే రూ.1.30లక్షల పరిహారం అందేది. ప్రస్తుతం రూ.2లక్షలు చెల్లిస్తున్నారు. దీంతో అనధికారికంగా రూ.30వేల వరకు వసూళ్లు సాగుతున్నాయి. పనిలో ప్రమాదవశాత్తు చనిపోతే రూ.6లక్షల వరకు ఇస్తారు. మీ సేవలో కార్మికులు దరఖాస్తు చేసుకోగానే ఆఫీసు నుంచి కొందరు, మీ సేవ నుంచి మరికొందరు రంగ ప్రవేశం చేస్తూ వసూళ్లు చేసుకుంటున్నారు. బీమా పరిహారం చెల్లింపులో థర్డ్‌ పార్టీతో విచారణ చేయాలి. దీంతో ఇన్సూరెన్స్‌ కంపెనీ ప్రతినిధులే కొందరు ఈ వసూళ్లలో ప్రధానంగా మారారు. మృతుని మరణం, వివరాలు అన్ని ఉన్నా డబ్బులు ఇవ్వకపోతే ఏదో ఒక కారణం చూపి పరిహారం రాకుండా చేస్తారనే భయంతో పైసలు ఇచ్చేందుకు ఒప్పుకుంటున్నారు.

డబ్బులిస్తే ఎవరికై నా కార్డు..

జిల్లాలో కార్మిక గుర్తింపు కార్డులు సైతం దుర్వి నియోగం అవుతున్నాయి. కార్డు పొందేందుకు 18ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయస్సు వరకు ఉన్న భవ న నిర్మాణ కార్మికులు అర్హులు. రెండు ఫొటోలు, ఏదేని గుర్తింపు కార్డు, బ్యాంకు పాస్‌బుక్‌, రేషన్‌కార్డు వివరాలు ఇస్తే మీ సేవ కేంద్రాల్లో కార్డు పొందుతున్నారు. రూ.110 బదులు రూ.వెయ్యి తీసుకుని అనుర్హులకు సైతం కార్డులు ఇచ్చేస్తున్నారు. రెన్యూవల్‌ కోసం రూ.60కి బదులు రూ. 200వరకు తీసుకుంటున్నారు. నిజమైన కార్మికులు కాకుండా సాగు భూములున్న యజమానులు, వారి కుటుంబాలు, ఎల్‌ఐసీ ఏజెంట్లు, ప్రైవేటు, అవుట్‌ సోర్సింగ్‌, వ్యాపారులు, విద్యావంతులు సైతం పొందారు. దీంతో నిజమైన అర్హులకు అన్యాయం జరుగుతోంది. అనర్హులు అధికంగా ఉండడంతో పరిహారం చెల్లింపులకు సైతం పైసలు చెల్లించి ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్నారు. జిల్లా కార్మిక శాఖలో జరుగుతున్న తెరవెనుక అవినీతిని నిర్మూలించాలని కార్మిక సంఘ నాయకులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement