చట్టంపై అవగాహన కలిగి ఉండాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్‌మెంటు యాక్టు(పోష్)–2013పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీతో కలిసి మహిళా ఉద్యోగులకు చట్టంపై అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపుల నిరోధం, నివారణ, పరిష్కారంపై తెలుసుకోవాలని అన్నారు. వేధింపులపై జిల్లా స్థానిక ఫిర్యాదుల కమిటీలో ఫిర్యాదు చేయవచ్చని, వివరాలు గోప్యంగా ఉంచుతారని తెలిపారు. జిల్లాలో 47 అంతర్గత ఫిర్యాదు కమిటీలు కొనసాగుతున్నాయని అన్నారు. మహిళల సంక్షేమం కోసం హెల్ప్‌లైన్ టోల్‌ఫ్రీ నంబరు 181 ఏర్పాటు చేశామని తెలిపారు. అనంతరం చట్టం వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో సంక్షేమ శాఖ అధికారి రౌఫ్‌ఖాన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అనిత, పశువైద్యధికారి శంకర్, కవిత పాల్గొన్నారు.
ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్, అదనపు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లతో ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటన, నామినేషన్ కేంద్రాలు, పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి వచ్చే విధంగా చూడాలని తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్‌దీపక్, జిల్లా అదనపు కలెక్టర్, పి.చంద్రయ్య, మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.


