ఇంటర్ ప్రయోగాలకు నిధులు
మంచిర్యాలఅర్బన్: ఇంటర్మీడియెట్ ప్రయోగ పరీక్షలకు ఇంటర్ విద్యాశాఖ ప్రత్యేక నిధులు విడుదల చేసింది. గత ఏడాది ప్రయోగ పరికరాల కొనుగోలుకు రూ.25వేలు మంజూరు చేయగా.. ఈ ఏడాది రెట్టింపు చేసింది. ఇంటర్ ప్రయోగ పరీక్షలు ఫిబ్రవరి 2న ప్రారంభమై 21న ముగుస్తాయి. జిల్లాలో పది ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా.. రూ.5లక్షలు ఇంటర్ విద్యాశాఖ విడుదల చేసింది. ఆయా కళాశాలల బ్యాంకు ఖాతాల్లో రూ.50వేల చొప్పున జమ అయ్యాయి. కలెక్టర్ అనుమతితో ప్రయోగ పరికరాలు కొనుగోలు చేయనున్నారు.
ఇక సులువు
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఫస్టియర్ విద్యార్థులు 1974మంది, సెకండియర్‌లో 1676 మంది ఉన్నారు. రెండో సంవత్సరం ఫిజిక్స్, కెమెస్ట్రి, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తారు. పాఠశాల స్థాయిలో పరిశోధనలు లేకపోవడం వల్ల ప్రతిభకు పదును లేకుండా పోతోంది. దీంతో విద్యార్థులకు ఇంటర్ మొదటి సంవత్సరంలోనే ప్రయోగాలు నేర్పించాల్సి ఉంటుంది. బోటనీ, జువాలజీ ల్యాబ్‌ల్లో జంతు కళేబరాలు, అవశేషాలు తదితరవి విద్యార్థులకు చూపించాలి. ఆకు, కాండం తదితర విషయాలు తెలుసుకునేందుకు మైక్రోస్కోప్‌లు వినియోగించాలి. రసాయనశాస్త్రంలో లవణ, మూలకాలు తదితర గురించి తెలియాలంటే రసాయనాలు అవసరం. ప్రయోగ పరికరాలు పిప్పెట్, బ్యూరెట్, స్క్రూగేజీ, వెర్మియట్, కాలిపస్‌తోపాటు హైడ్రో క్లోరి యాసిడ్, సల్పర్ యాసిడ్‌తో 24 రకాల సాల్ట్(లవణాలు) ప్రయోగాలకు అవసరం. ఈ నేపథ్యంలో ప్రయోగ పరికరాలు, రసాయనాలకు రూ. 50వేల చొప్పున మంజూరు కావడంతో విద్యార్థుల్లో రెట్టింపు ఉత్సాహం నింపనుంది.
వృత్తి విద్య కోర్సులో..
వృత్తి కోర్సుల్లో కంప్యూటర్ సైన్స్, ఎంపీహెచ్‌డబ్ల్యూ, ఎంఎల్‌టీ ఉంటాయి. మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్(ఎంపీహెచ్‌డబ్ల్యూ), మెడికల్ ల్యాబరెటీ టెక్నాలజీ(ఎంఎల్‌టీ) కోర్సుల్లో పరికరాలు అవసరం. క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా చదువులు సాగుతున్నాయి. గతేడాది నిధులు స్టేతస్కోప్, బీపీ మిషన్, వెయింగ్ మిషన్ కొనుగోలుకే సరిపోయాయి. ఇంకా ప్రయోగాలు ఎలా చేస్తారో తెలియకుండా పోయింది. చాలా కళాశాలలు పా ఠ్యాంశాల బోధనకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నా రు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీలో ప్ర యోగాలు చేయించాల్సి ఉండగా చాలా మందికి పరికరాలు పరిచయం చేసేందుకే పరిమితం చేస్తున్నాయనే విమర్శలున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో పరికరాలు, కెమికల్స్‌కు నిధులు మంజూరు అయ్యాయని డీఐఈవో అంజయ్య తెలిపారు.


