ఆటలాడేదెలా..!
అర్ధంతరంగా నిలిచిన మినీ స్టేడియం నిర్మాణం
ఆరేళ్లుగా పిల్లర్లకే పరిమితం
పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
లక్సెట్టిపేట: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మినీ స్టేడియం నిర్మాణ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఆరేళ్లుగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోవడంతో క్రీడాకారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 2019 అక్టోబర్‌లో డీఎంఎఫ్‌టీ నిధులు రూ.75లక్షలు అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. 2020లో పనులు ప్రారంభించి ఓ వైపు గ్యాలరీ పనులు.. మరోవైపు పిల్లర్ల దశ వరకు నిర్మాణం చేపట్టారు. రెండు వైపుల ఎల్ ఆకారంలో మినీస్టేడియం గ్యాలరీ ఏర్పాటుతో మినీ స్టేడియం నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు. మినీ స్టేడియం అందుబాటులోకి వస్తుందని క్రీడాకారులు సంతోషించారు. కానీ.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా కాంట్రాక్టర్ పనుల్లో జాప్యం చేశారు. మంజూరైన నిధులు సరిపోలేదని సదరు కాంట్రాక్టర్ పనులను అర్ధంతరంగా వదిలేశారు. ఆరేళ్లుగా నిలిచిపోయిన పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఉదయం వేళ వాకింగ్‌కు వెళ్లేవారు, క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారు. సగంలో నిలిచిపోయిన పనులు క్రీడాకారుల ఆటలకు అడ్డంకిగా మారాయి.
ఆట స్థలం కరువు..
పట్టణం మధ్యలో కళాశాల పక్కన మైదానం ఉండడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో క్రీడాకారులు, వాకింగ్ కోసం వస్తుంటారు. దసరా, సంక్రాంతి, వేసవిలో క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహిస్తారు. మినీ స్టేడియం పనులతో మైదాన విస్తీర్ణం తగ్గి స్థలం కరువైంది. క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందించాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడంతో ఇబ్బందిగా మారింది. స్పందించి మినీ స్టేడియం పనులు పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు.
ఆటలాడేదెలా..!


