తక్షణ ఫిర్యాదే రక్షణ
మందమర్రికి చెందిన ఓ యువతి వాట్సాప్ కు రూ.లక్ష ఖరీదైన ఫోన్ గెలుచుకున్నట్లు ముంబయి నుంచి సందేశం వచ్చింది. వారం రోజుల్లో ఫోన్ వస్తుందని డాక్యుమెంటేషన్, బీమా అంటూ రూ.55వేలు తీసుకున్నారు. నెల రోజులు గడిచినా ఫోన్ రాకపోవడంతో మోసపోయానని గ్రహించి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మంచిర్యాలలోని సింగరేణి ఉద్యోగి ఒకరు సైబర్ మోసానికి గురై రూ.2లక్షలు పోగొట్టుకున్నాడు. వెంటనే సైబర్ క్రైం టోల్‌ప్రీ నంబరు 1930లో ఫిర్యాదు చేశాడు. గత ఫిబ్రవరిలో ఫిర్యాదు చేయగా.. పోయిన సొమ్ము తిరిగి బ్యాంకు ఖాతాలో పడే విధంగా చర్యలు తీసుకున్నారు.
ఓ ఉద్యోగి పార్ట్‌టైం జాబ్ కోసం ఇంటి వద్ద పని ప్రాజెక్టు వర్క్ చేసింది. ప్రాజెక్టు వర్క్ తప్పుగా చేయడం వల్ల కంపెనీ రూ.కోటి నష్టపోయిందని, రూ.5లక్షలు చెల్లించాలని బెదిరించారు. రూ.5లక్షలు చెల్లించగా.. రెండ్రోజుల తర్వాత మళ్లీ ఫోన్ చేసి మరో రూ.2లక్షలు కట్టాలని బెదిరించారు. వెంటనే సైబర్ క్రైం టోల్ ఫ్రీ నంబరులో ఫిర్యాదు చేసింది.
మంచిర్యాలక్రైం: దొంగతనాలు.. మోసాలు.. వేధింపులపై వెంటనే స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. అంతే వేగంగా పోలీసులూ విచారణ చేపడతారు. సాధ్యమైనంత త్వరగా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ తక్షణ ఫిర్యాదుపైనే ఆధారపడి ఉంటాయి. కానీ.. సైబర్ మోసగాళ్ల విషయంలో పరువు పోతుందనే భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెనుకడుగు వేస్తుంటారు. దీంతో బాధితులు రూ.లక్షల్లో మోసపోతున్నారు. కొందరు ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్యకూ పాల్పడుతున్నారు. సైబర్ మోసానికి గురైనప్పుడు తక్షణమే ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న సొమ్మును తిరిగి పొందే అవకాశం ఉందని సైబర్ క్రైం పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. రామగుండం పోలీసు కమిషనరేట్ సైబర్ క్రైం అధికారులు ఇటీవల కీలకంగా వ్యహరించారు. కొందరు వ్యక్తులు జన్నారం కేంద్రంగా కాంబోడియా దేశం నుంచి సైబర్ మోసాలు ప్రారంభించిన నాలుగు నెలల వ్యవధిలోనే సుమారు రూ.5కోట్లు కొల్లగొట్టారు. రామగుండం సైబర్ క్రైం పోలీసులు సాంకేతికతతో గుర్తించి నలుగురు నిందితులను అరెస్టు చేసి సైబర్ నేరస్తులకు ఆదిలోనే సంకెళ్లు వేశారు.
సొమ్ము రాబట్టారు..
ఇటీవల కాలంలో సామాన్యుల నుంచి మొదలుకు ని ఉన్నత స్థాయి వ్యక్తుల వరకు సైబర్ నేరస్తుల చక్రబంధంలో చిక్కుకుని విలవిలలాడుతున్నారు. కొందరు సామాజిక మాధ్యమాల్లో పరిచయమై హా నీట్రాప్, డిజిటల్ అరెస్టు, ట్రెండింగ్ పార్ట్‌టైం జాబ్ పేరిట మోసాలకు పాల్పడుతున్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో గత ఏడాది 228 కేసులు నమోదు కాగా, ఈ కేసుల్లో 27మంది సైబర్ నేరస్తులను అరెస్టు చేశారు. బాధితులు రూ.3,13,00,908 పోగొట్టుకోగా.. మోసగాళ్ల ఖాతాల నుంచి రూ.1,30,25,920 బాధితులకు రిఫండ్ అయ్యేలా చూశారు. తక్షణ ఫిర్యాదు కారణంగానే పోగొట్టుకున్న డబ్బు తిరిగి రప్పించడం సాధ్యమవుతుంది. పరువు పోతుందనే భయంతో పోలీసులను ఆశ్రయించని బాధితులు మరింత మంది ఉండవచ్చని పోలీసు అధికారులు అంటున్నారు.
సైబర్ వారియర్స్‌కు శిక్షణ
సైబర్ నేరాల దృష్ట్యా ‘సైబర్ వారియర్స్’ పేరిట రాష్ట్రంలోని ప్రతీ పోలీసు స్టేషన్‌లో ముగ్గురు కానిస్టేబుళ్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వారికి ప్రత్యేక ట్యా బ్‌లు అందజేశారు. ఎప్పటికప్పుడు పిటి కేసులు, డయల్ 100 ఫిర్యాదులు, సైబర్ క్రైం నేరాలపై 1930 నంబరుకు వచ్చే ఫోన్ కాల్స్‌కు ఐదు నుంచి పది నిమిషాల్లోనే స్పందించేలా చూస్తున్నారు. బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు డ్రా అయినట్లు తెలియగానే ఫిర్యాదు చేస్తే వెంటనే సదరు ఖాతాను ఫ్రీజ్ చేసి డబ్బులు ఎవరూ డ్రా చేసుకునే వీలు లే కుండా చూస్తారు. ఇలా తక్షణ ఫిర్యాదు వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆలస్యమైతే నేరస్తులు ఖాతాల్లో నుంచి డ్రా చేసుకుంటారు. ఆ తర్వాత రికవరీ చేయడం కష్టతరమని పోలీసులు చెబుతున్నారు.
సైబర్ మోసాలపై ప్రత్యేక నిఘా
సైబర్ మోసాలపై ప్రత్యేక నిఘా ఉంచాం. గుర్తు తెలి యని నంబరు నుంచి ఫోన్ వస్తే వ్యక్తిగత వివరాలు చె ప్పొద్దు. బ్యాంకు సిబ్బంది అంటూ ఫోన్ చేస్తారు. బ్యాంకు సిబ్బంది ఎప్పు డూ మన బ్యాంకు ఖాతా వివరాలు అడగరు. సైబర్ మోసానికి గురయ్యామని తెలిసిన వెంటనే ఫిర్యాదు చేయాలి. లక్కీ విన్నర్, ఆకర్షణీయమైన ఆఫర్ల పేరుతో వాట్సాప్ లింకులు పంపిస్తుంటా రు. వాటిని క్లిక్ చేయకూడదు. క్లిక్ చేయగానే మన వివరాలు సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతాయి. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
– ఎగ్గడి భాస్కర్, డీసీపీ, మంచిర్యాల
జిల్లాలో కొన్ని ఘటనలు..
తక్షణ ఫిర్యాదే రక్షణ


