కాంగ్రెస్ హయాంలో అన్ని వర్గాలకు మేలు
చెన్నూర్: గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అన్ని వర్గాల ప్రజలను వంచించిందని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో అన్ని వర్గాలకు మేలు జరిగిందని అన్నారు. బుధవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చెన్నూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, బీజేపీ ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకుడు బత్తుల సమ్మయ్య తన అనుచరులు 200మందితో మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 50వేల టీచర్ పోస్టులు భర్తీ చేసిందని తెలిపారు. సింగరేణి పవర్ ప్లాంటులో త్వరలో 850 మెగావాట్ల ప్లాంటుకు భూమి పూజ చేస్తామని అన్నారు. కొత్తగా గెలిచిన సర్పంచ్‌లకు రూ.20లక్షలు నిధులు అందజేస్తామని, త్వరలో ప్రొసీడింగ్‌లు పంపిణీ చేస్తామని చెప్పారు. బీఆర్‌ఎస్ అవినీతి, ఆరోపణలపై శాసనమండలి సాక్షిగా కవిత తన అన్న, బావ రాష్ట్రాన్ని దోచుకున్నారని చెప్పారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాఽథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, మాజీ జెడ్పీటీసీ బెల్లంకొండ కరుణసాగర్‌రావు, మాజీ సర్పంచ్ గొడిసెల బాపురెడ్డి పాల్గొన్నారు.
బస్సు ప్రారంభం
మందమర్రిరూరల్: మందమర్రి పట్టణంలోని మార్కెట్ నుంచి బీ జోన్ మీదుగా మంచిర్యాలకు నూతన బస్సును మంత్రి వివేక్‌వెంకటస్వామి జిల్లా కలెక్టర్ కుమార్‌దీపక్, మంచిర్యాల డీసీపీ బాస్కర్, మంచిర్యాల ఆర్టీసీ డీఎం శ్రీనివాస్‌తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ బస్సు రోజుకు కనీసం ఆరు ట్రిప్పులు ఉంటుందని, త్వరలోనే ప్రజల డిమాండ్ మేరకు పాత బస్టాండ్ వరకు పొడగించే ఆలోచన ఉన్నామని డీఎం తెలిపారు.
ప్రహరీ పనులు..
భీమారం: మండల కేంద్రంలోని బీసీ కాలనీలో ప్రభుత్వ పాఠశాల ప్రహరీ పనులను మంత్రి వివేక్‌వెంకటస్వామి బుధవారం ప్రారంభించారు. బస్డాండ్ ప్రాంతంలో ప్రయాణికుల సౌకర్యార్థం మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సర్పంచ్ విజయలక్ష్మి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


