అంగన్‌వాడీల విద్యార్హత ఇంటర్‌ | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల విద్యార్హత ఇంటర్‌

Jun 20 2023 1:00 AM | Updated on Jun 20 2023 10:50 AM

మంచిర్యాలలోని అంగన్‌వాడీ కేంద్రం(ఫైల్‌) - Sakshi

మంచిర్యాలలోని అంగన్‌వాడీ కేంద్రం(ఫైల్‌)

మంచిర్యాలటౌన్‌: అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల నియామకంలో ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. గతంలో ఈ పోస్టులకు కనీస విద్యార్హత పదో తరగతి ఉండగా ఇంటర్మీడియెట్‌కు పెంచింది. వయోపరిమితిని 35 ఏళ్లకే పరిమితం చేస్తూ, 21 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు వారికి మాత్రమే దరఖాస్తుకు అవకాశం కల్పించింది. ప్రాజెక్టుల వారీగా రిజర్వేషన్‌ ఖరారుకు ఆదేశాలు జారీ చేసింది. ఇకపై కొత్త మార్గదర్శకాల ప్రకారమే ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రధాన అంగన్‌వాడీ టీచర్‌గా పదోన్నతికి మినీ అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు కనీసం ఐదేళ్లు అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేసి, 45 ఏళ్లలోపు వయస్సు ఉండి, ఇంటర్మీడియెట్‌ విద్యార్హత ఉండాలి. ఖాళీల భర్తీకి రిజర్వేషన్‌, రోస్టర్‌ పాయింట్‌, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ సెంటర్ల విధి విధానాల ఖరారుకు ఆదేశాలను జారీ చేశారు.

ఆయా పోస్టులకు గాను అర్హులుగా స్థానికంగా ఉన్న వివాహిత, అర్బన్‌ ప్రాంతాల్లో అదే వార్డుకు చెందిన వారు, గ్రామీణ ప్రాంతాల్లోనైతే అదే గ్రామ పంచాయతీకి చెందిన వారు, ఏజెన్సీలో సంబంధిత హ్యాబిటేషన్‌కు చెందిన మహిళ అయి ఉండాలి. వితంతువులు, ఒంటరి, అనాథ మహిళలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఎంపిక ప్రక్రియ కమిటీకి కలెక్టర్‌ చైర్మన్‌గా, ఏజెన్సీ ప్రాంతాల్లో ఐటీడీఏ పీవో సభ్యులుగా, నాన్‌ ట్రైబల్‌ ప్రాంతాల్లో ఆర్డీవో, జిల్లా సంక్షేమ శాఖ అధికారి సభ్యులుగా వ్యవహరిస్తారు.

ఖాళీల భర్తీకి నిబంధనలు
జిల్లాలో 969 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, అందులో ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు 895 ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం 840 మంది టీచర్లు పనిచేస్తుండగా, 55 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 738 మంది ఆయాలు ఉండగా, 157 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక మినీ అంగన్‌వాడీ కేంద్రాలు 74 ఉండగా, 59 మంది టీచర్లు ఉండగా, 15 మినీ అంగన్‌వాడీ టీచరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

గత ఏడాది ఖాళీగా ఉన్న గ్రేడ్‌–2 సూపర్‌వైజర్‌ పోస్టులకు గాను పదేళ్లు టీచర్‌గా పనిచేసి, డిగ్రీ అర్హత ఉన్న వారికి అర్హత పరీక్ష నిర్వహించి, మెరిట్‌ ప్రకారంగా ఎంపికై న వారిని సూపర్‌వైజర్లుగా విధుల్లోకి తీసుకున్నారు. 17 పోస్టులకు గాను జిల్లా నుంచి 8 మంది అంగన్‌వాడీ టీచర్లు పదోన్నతి పొందడంతో ఆయా కేంద్రాల్లోనూ అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు ఖాళీ అయ్యాయి. పక్కనే ఉన్న ఇతర అంగన్‌వాడీ టీచర్లకు ఇంచార్జి బాధ్యతలు అప్పగించి నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement