తెలంగాణకు కేసీఆర్ నాయకత్వం అవసరం
● బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్
రామకృష్ణాపూర్: పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వం అవసరమని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో సోమవారం ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వారి పాలనలో ప్రగతి ఆగిపోయి అవినీతి తాండవం చేస్తోందని విమర్శించారు. తాను గెలిస్తే ఈ ప్రాంతంలో పెద్ద ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి 45వేల మందికి ఉద్యోగాలు ఇస్తానన్న మంత్రి వివేక్ ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించకపోగా తన కుటుంబానికి మాత్రం మూడు ఉద్యోగాలు సాధించుకున్నారని అన్నారు. ఈ ప్రాంతానికి పూర్వ వైభవం రావాలంటే బీఆర్‌ఎస్, సీపీఐ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.


