బుకింగ్ ద్వారానే యూరియా పంపిణీ
మంచిర్యాలరూరల్(హాజీపూర్): యూరియా పంపిణీ పారదర్శకంగా, సక్రమంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఫర్టిలైజర్ బుకింగ్ మొబైల్ యాప్ ద్వారా యూరియా పంపిణీ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిందని మంచిర్యాల వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మామిడి కృష్ణ తెలిపారు. సోమవారం హాజీపూర్ మండలంలో ఎరువుల పంపిణీ విధానాన్ని పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ రైతులు తమ మొబైల్ నంబర్ ద్వారా యాప్‌లో నమోదు చేసుకుని సులభంగా యూరియా పొందవచ్చని తెలిపారు. పట్టా కలిగిన భూ యజమానులు, అటవీ హక్కుల పట్టాదారులు, కౌలుదారులు యారియా బుకింగ్‌కు అర్హులని, బుకింగ్ సమయంలో రైతుల గుర్తింపును నిర్ధారించేందుకు పట్టాపాస్ పుస్తకంతో అనుసంధానమైన మొబైల్ నంబర్‌కు ఒకసారి మాత్రమే ఉపయోగించే ఓటీపీ నంబరు ద్వారా యూరియా బుకింగ్ అవుతుందని, ఈ బుకింగ్ 24 గంటలు చెల్లుబాటు అవుతుందని తెలిపారు. బుకింగ్ విధానంపై సందేహాలు ఉంటే ఏఈఓలను సంప్రదించాలని తెలిపారు.


