● మున్సిపల్ ఎన్నికల్లో తాయిలాల పర్వం ● ప్రచారం ముగియడం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మున్సిపల్ ఎన్నికల్లో ప్రచార పర్వం ముగియడంతో తాయిలాల పంపిణీకి తెరలేచింది. అభ్యర్థులు ఎలాగైనా గెలువాలనే లక్ష్యంతో రూ.లక్షలు కుమ్మరిస్తుండడంతో ఓటు విలువ పెరిగింది. జిల్లాలో మంచిర్యాల కార్పొరేషన్‌తో సహా బెల్లంపల్లి, చెన్నూర్, క్యాతనపల్లి, లక్సెట్టిపేట మున్సిపాల్టీల్లో చివరి రెండ్రోజులు భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం సాయంత్రం ఐదు గంటల వరకు ప్రచారం ముగిసింది. దీంతో తెరవెనుక మంతనాలు మొదలు పెట్టారు. వలస వెళ్లిన ఓటర్లకు ఇప్పటికే ఆన్‌లైన్‌లో నగదు పంపిస్తున్నారు. రవాణా, ఇతర ఖర్చులు భరిస్తూ ఓటుకు కొంత మొత్తంలో ముట్టజెప్తున్నారు. కరీంనగర్, వరంగల్, హైదరాబాద్‌తోపాటు పలు చోట్లకు ఉద్యోగ, ఉపాధి, వ్యాపార రీత్యా వెళ్లిన వారితో మాట్లాడుతున్నారు. స్థానికంగా ఉన్న వారికి మద్యం సీసాలు, నగదు ఇస్తున్నారు. ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకు అందజేస్తున్నారు. అవసరమైతే మళ్లీ పంపిణీ చేసేందుకు కూడా సిద్ధపడ్డారు. బలహీనవర్గాలు, నిరుపేద, దినసరి కూలీ చేసుకునే ఓటర్లపై అధికంగా దృష్టి సారించి డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఇక అభివృద్ధి చెందిన కాలనీల్లో మహిళలు, అపార్టుమెంట్లు, సంఘాల వారీగా గుర్తించి అందరికీ డబ్బులు పంచేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల్లో దాదాపు భారీగా తాయిలాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇదే అదునుగా ఓటర్లు సైతం ఎవరు ఇచ్చినా డబ్బులు తీసుకుంటున్నారు.
మేయర్, చైర్‌పర్సన్ అభ్యర్థులు ఉన్న చోట్ల
మంచిర్యాల కార్పొరేషన్‌లో మేయర్ పదవి ఆశిస్తున్న డివిజన్లలో ఓటు మరింత ఖరీదైంది. ఓటుకు రూ.2వేలకు పైగానే ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. పదవి రేసులోఉన్న ఐదుగురు అభ్యర్థుల వరకు ఈ మేరకు తమ డివిజన్లలో అందరికీ డబ్బుతోపాటు మద్యం పంపిణీలో నిమగ్నమయ్యారు. బెల్లంపల్లి, చెన్నూర్, క్యాతనపల్లి, లక్సెట్టిపేటలో చైర్‌పర్సన్ అభ్యర్థులు సైతం భారీగానే పంచుతున్నట్లు తెలుస్తోంది. కనీసం రూ.వెయ్యి పంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అధికార పార్టీ నుంచి చెన్నూ రు, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో పలువురు అభ్యర్థులకు నగదు రూపంలో సాయం అందినట్లు స మాచారం. చైర్‌పర్సన్ అభ్యర్థులు మాత్రం అధికంగా సొంత డబ్బులే ఖర్చు చేసుకుంటున్నారు.
‘సర్.. డబ్బులు పంచుతున్నారు’
ఎన్నికల్లో డబ్బులు, మద్యం, కానుకలు పంచుతున్నారని ఎన్నికల నిఘా అధికారులకు ప్రతీరోజు పది వరకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ ప్రత్యర్థులపై కక్షతోనూ కొందరు సమాచారం ఇస్తున్నారు. అర్ధరాత్రి వేళ కూడా ఇటీవల నస్పూర్, శ్రీరాంపూర్, జిల్లా కేంద్రం, చెన్నూరు, బెల్లంపల్లి, క్యాతనపల్లి పరిధిలో పలు ఫిర్యాదుల వచ్చాయి. అధికారులకు ఎలాంటి నగదు లభ్యం కావడం లేదు. బరిలో ఉన్న వారందరూ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేస్తూ అధికారులకు పట్టించేందుకు కాల్స్ చేస్తున్నారు. స్థానిక తహసీల్దార్ ర్యాంకుతో కూడిన అధికారులు, పోలీసులు, వీడియో, ఫొటోగ్రాఫర్ సమక్షంలో తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎక్కడా డబ్బులు గుర్తించలేదు.
5 శాతం కమీషన్‌తో నగదుగా మార్పు
ఓటర్లకు డబ్బుల పంపిణీకి అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. కొందరు అప్పులు తెచ్చి మరీ ఖర్చు చేస్తున్నారు. కొందరి డబ్బులు ఆన్‌లైన్‌లో ఉండడంతో లావాదేవీలు బయటపడకుండా ఉండేందుకు నగదుగా మార్చుతున్నారు. నగదు చేతిలో ఉన్న వారు ఐదు శాతం కమిషన్‌తో ఆన్‌లైన్ డబ్బును నగదుగా మార్పిడి చేసి ఇస్తున్నారు. జిల్లా కేంద్రంలో పలువురు అభ్యర్థులు డబ్బుల కోసం తిప్పలు పడుతున్నారు.
● మున్సిపల్ ఎన్నికల్లో తాయిలాల పర్వం ● ప్రచారం ముగియడం


