ఐదంచెల భద్రత
మంచిర్యాలక్రైం: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఐదంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో భదత్ర ఏర్పాట్లపై సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం మద్యం, డబ్బు, బహుమతుల పేరుతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా అన్ని విధాల చర్యలు తీసుకున్నామని అన్నారు. ఈ నెల 11న పోలింగ్ నిర్వహణకు భదత్ర ఏర్పాట్లు చేశామని తెలిపారు. జిల్లాలో 444 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. ఇందులో 179 సమస్యాత్మకంగా గుర్తించామని, వీటిపై ప్రత్యేక నిఘా ఉంటుందని, ప్రత్యేక బృందాలు ఆయా ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేస్తుంటాయని అన్నారు. 168 మంది పాత నేరస్తులను తహసీల్దార్ల ఎదుట బైండోవర్ చేశామని, అనుమతి లేకుండా నగదు తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. రూ.2.58లక్షలు నగదు సీజ్ చేశామని, రూ.2.20లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకుని 51కేసులు నమోదు చేశామని అన్నారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి ఆరు కేసులు నమోదు చేశామని, జిల్లాలోని గూడెం, అర్జున్‌గుట్ట, ఇందన్‌పల్లి, తాండూర్‌ర్ వద్ద ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడితే కేసు నమోదు చేస్తామని చెప్పారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన, డబ్బులు, మద్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిస్తే డయల్ 100, ఎన్నికల ఫిర్యాదుల విభాగం టోల్ ఫ్రీ నంబర్ 08736 250501లో సమాచారం అందించాలని తెలిపారు.
బందోబస్తు సిబ్బంది ఇలా..
సీపీ డీసీపీ ఏసీపీ సీఐ ఎస్సై ఫోర్స్
1 1 6 17 43 900


