మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు గొప్ప ప్రయోజకులు కావాలని జిల్లా కేంద్రంలోని పలు స్కూల్స్‌లో నాణ్యమైన విద్య అందుతుందన్న భావనతో తల్లిదండ్రులు ఇక్కడి పాఠశాలల్లో చేర్పించారు. వసతి కోసం ప్రభుత్వ హాస్టళ్లలో చేర్పిస్తే అక్కడ పూర్తి స్థాయిలో వసతులు లేకపోగా.. పాఠశాలలకు వెళ్లేందుకు అనేక ఇక్కట్ల పాలయ్యే పరిస్థితి నెలకొంది. విద్యార్థులు ఉదయం సాయంత్రం వేళ్లలో పాఠశాలకు సమయానికి వెళ్లాలన్న, హాస్టల్‌కు సకాలంలో చేరుకోవాలన్న ఎండ, వర్షం పట్టించుకోకుండా కాలినడకన ప్రయాణం సాగించాల్సి ఉంది. ఉదయం సాయంత్రం వేళ్లలో కలిపి సుమారు 5 కిలోమీటర్ల మేర నడక సాగించాల్సి వస్తుంది. 5, 6, 7 తరగతుల చిన్నరులు రోడ్లపై నడవాలంటే తీవ్ర ఇబ్బందిగా భావించే పరిస్థితి. అయిన ఇటూ హాస్టళ్ల వార్డెన్‌లు, జిల్లా సంక్షేమశాఖల అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
దూరం ఎందుకు హాస్టళ్లు
లక్ష్మీనగర్ కాలనీలో ఉన్న బాలుర హాస్టల్స్ రెండు కూడా ప్రభుత్వ భూమిలో పక్క భవనాలు నిర్మించారు. ఈ క్రమంలో అక్కడ ప్రభుత్వ పాఠశాలలు లేకపోవడంతో జిల్లాకేంద్రంలో ఉన్న పాఠశాలలకు రావాల్సిన పరిస్థితి ఉంది. వానగుట్ట దగ్గరున్న ఎస్టీ హాస్టల్ కూడా ప్రభుత్వ భవనం కావడంతో అక్కడ హాస్టల్ నిర్వహిస్తున్నారు. పాఠశాలలు సకాలంలో లేకపోడంతో జిల్లా కేంద్రానికి రావాల్సి ఉంది. అయితే గతవారం రోడ్డు దాటుతున్న ఓ బాలుడికి బైక్ తగిలి గాయాలైనట్లు తోటి విద్యార్థులు పేర్కొంటున్నారు.
సదుపాయం ఏర్పాటు చేస్తాం
లక్ష్మీనగర్ కాలనీలో ఉన్న ఎస్సీ బాలుర, ఆనంద నిలయం విద్యార్థులు పాఠశాలకు కాలినడకన వెళ్తున్నట్లు దృష్టిలో ఉంది. వారికోసం వాహనం ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ, ప్రైవేటు ఎన్జీఓల ద్వారా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. గతంలో ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఇబ్బంది లేకుండా చూస్తాం.
– సునీత, ఎస్సీ సంక్షేమశాఖ అధికారిణి
తక్కువ మంది విద్యార్థులున్నారు
వానగుట్ట వద్ద ఉన్న ఎస్టీ హాస్టల్ విద్యార్థులు జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలలకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. చాలా తక్కువ మంది విద్యార్థులు వెళ్తున్నారని ఇటీవల వార్డెన్ పేర్కొన్నారు. అక్కడ ఆర్టీసీ బస్సు ఆపేవిధంగా చర్యలు తీసుకుంటాం.
– ఛత్రునాయక్, ఎస్టీ సంక్షేమశాఖ అధికారి
అన్నీ తెలిసినా.. అధికారులు పట్టించుకోరు
విద్యార్థులు కిలోమీటర్ల మేర నడిచి వెళ్తున్నారని అధికారులు, జిల్లా ఉన్నతాధికారులకు తెలిసినప్పటికీ పట్టించుకోవడంపై తీవ్ర విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. గతంలో సంబంధిత హాస్టళ్ల వార్డెన్‌లు సంక్షేమ శాఖ అధికారులకు సమస్యను చెప్పారు. ఈ విషయం గత కలెక్టర్ దృష్టికి వెళ్లినప్పటికీ విషయాన్ని పట్టించుకోలేదని తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న హాస్టళ్ల వార్డెన్లు విద్యార్థులను పూర్తిగా పట్టించుకోవడం లేదని తెలుస్తుంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్‌లో విద్యార్థులకు ప్రభుత్వం నుంచి షూ ఇవ్వాల్సి ఉంది. కానీ విద్యార్థులకు అందించలేదని తెలుస్తుంది. దీంతో విద్యార్థులు కాళ్లకు షూ, చెప్పులు లేకుండా ఉత్తి కాళ్లతో నడిచి వెళ్లడం విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది.
జిల్లా కేంద్రంలోని హాస్టల్ విద్యార్థులు బడికి వెళ్లేందుకు ఇక్కట్లు
ఎండా, వర్షం వచ్చిన స్కూల్‌కు సమయానికి చేరుకోవాల్సిందే..
కాళ్లకు చెప్పుల్లేకుండా కిలోమీటర్ల మేరా నడిచి వెళ్తున్న వైనం


