కల్వకుర్తి రూరల్: పట్టణంలోని బీఎస్‌ఎన్‌ఎల్ మైదానంలో 16 రోజులుగా నిర్వహిస్తున్న 91వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం భక్తిశ్రద్ధల నడుమ అత్యంత వైభవోపేతంగా ముగిసింది. సోమవారం చివరి రోజు నిర్వహించిన కార్యక్రమాలతో త్యాగం పరిపూర్ణమైందని కృష్ణజ్యోతి స్వరూపానందస్వామిజీ అన్నారు. శాంతిహోమం, గోపూజ, మహాపూర్ణాహుతి, గురుపూజ, అవబదస్నానం ఆచరించారు. సాయంత్రం ఉత్సాహంగా ఉట్టికొట్టు కార్యక్రమం జరిపారు. రాత్రి రాధాకృష్ణ శాంతికల్యాణ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం రుత్వికులను ఘనంగా సత్కరించారు. ముగింపు సందర్భంగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హాజరై భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. సాంప్రదాయాలను గౌరవించి ధర్మబద్ధంగా జీవించాలన్నారు. అనంతరం యాగ నిర్వాహకులు స్వామిజీ ఎమ్మెల్యేకు ఖడ్గాన్ని బహూకరించారు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డితో పాటు ప్రముఖులు యాగానికి విచ్చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు ముచ్చర్ల జనార్ధన్‌రెడ్డి రూ.5 లక్షలు, నాయకుడు జూలూరి బాలస్వామి రూ.51 వేలు విరాళం అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బృంగి రత్నమాల ఆనంద్‌కుమార్, జూలూరు రమేష్‌బాబు, కొండూరు గోవర్ధన్, బీచని బాలకృష్ణ, చిగుళ్లపల్లి సతీశ్, పోలాసురేందర్, మాచి పెద్దిరామస్వామి పాల్గొన్నారు.


