వర్షం అంతంతే.. ప్రత్యామ్నాయమే మేలు | - | Sakshi
Sakshi News home page

వర్షం అంతంతే.. ప్రత్యామ్నాయమే మేలు

Aug 4 2026 1:11 AM | Updated on Aug 4 2026 1:11 AM

మహబూబ్‌నగర్‌ (వ్యవసాయం): ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో రైతులు పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు విధానాన్ని మార్చుకోవాలని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సూచించారు. పత్తి, కంది, వరి, జొన్న, కూరగాయల పంటలను పరిశీలించిన అనంతరం చీడపీడల నివారణ, పోషక నిర్వహణతో పాటు ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు పలు సూచనలు చేశారు. జిల్లాలోని కౌకుంట్లతో పాటు రేకులంపల్లి, ఇస్రంపల్లి, అప్పంపల్లి గ్రామాల్లో సోమ వారం పీజేటీఎస్‌ఏయూ శాస్త్రవేత్తలు డాక్టర్‌ కె.కల్యాణి, డాక్టర్‌ వి.దివ్యవాణి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు, పంటల ఎదుగుదల, చీడపీడల ఉధృతిని పరిశీలించి రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు అందించారు.

యాజమాన్య పద్ధతులు

పత్తి పంటలో రసం పీల్చే పురుగుల ఉధృతి కనిపిస్తే ఎసిటామిప్రీడ్‌ను లీటరు నీటికి 0.25 గ్రాములు, పచ్చదోమ నివారణకు ఫ్లోనికామిడ్‌ను లీటరు నీటికి 0.3 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలని సూచించారు. దీంతో చీడపీడల ఉధృతిని సమర్థవంతంగా నియంత్రించవచ్చని తెలిపారు. కంది, పత్తి పంటల్లో వర్షాభావ పరిస్థితుల కారణంగా మొక్కల ఎదుగుదల దెబ్బతినకుండా ఉండేందుకు రెండు శాతం యూరియా ద్రావణం లేదా 19:19:19 ఎరువు ద్రావణం, అలాగే నానో డీఏపీ, నానో యూరియా పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. జొన్న పంటలో కాండం తొలిచే పురుగు నివారణకు క్లోరంట్రానిలిప్రోల్‌ను లీటరు నీటికి 0.3 మిల్లీమీటర్ల చొప్పున పిచికారీ చేయాలని, ప్రత్యామ్నాయంగా కార్బోఫ్యూరాన్‌ 3జీ గుళికలను ఎకరానికి నాలుగు కిలోల చొప్పున వేయాలని సూచించారు. ఆగస్టు 15లోపు కంది, రాగి, కొర్ర, ఆముదం వంటి తక్కువ నీటితో సాగయ్యే పంటలను బోదెలు, సాళ్ల పద్ధతిలో సాగు చేయడం ఉత్తతమని సూచించారు. కార్యక్రమంలో ఏఓ శివ, ఏఈఓలు గాయత్రి, శివ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement