● వెంచర్లలో వరుసగా విద్యుత్ వైర్లు చోరీ చేస్తున్న దొంగల అరెస్టు
● నిందితుల నుంచి 750 కేజీల వైరు, నగదు స్వాధీనం
వెల్దండ: ఈజీమనీకి అలవాటుపడి దొంగతనాలు చేస్తున్న ముఠాను సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్దండ సీఐ రఘువీర్‌రెడ్డి తెలిపారు. వివరాలిలా.. వెల్దండ స్టేషన్ పరిధిలోని వెంచర్లలో ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లు చోరీ అవుతున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం గ్రామానికి చెందిన మునావత్ మోహన్, మునావత్ దినేష్ తండ్రీ కొడుకులు పాత ఇనుప దుకాణం నడిపిస్తున్నారు. వీరికి పరిచయం ఉన్న రాజు, దినేష్, రమేష్‌తో కలసి ఈజీమనీ సంపాదించాలని నిర్ణయించుకుని ముఠాగా ఏర్పడ్డారు. సోమవారం కొట్రచౌరస్తాలో ట్రాలీ ఆటోతో తండ్రీకొడుకులు అనుమానంగా కనిపించారు. దీంతో వారిని విచారించడంతో మే నెలలో వెల్దండ మండలం పెద్దాపూర్ శివారులో ఉన్న ఆర్‌ఆర్‌ఆర్ వెంచర్‌లో దినేష్, మోహన్, అదేవిధంగా యూపీకి చెందిన రాజు, హైదరాబాద్‌కు చెందిన దినేష్, రమేష్ ఐదుగురు కలిసి 60విద్యుత్ స్తంభాల వైర్‌ను చోరీ చేసినట్లు తెలిపారు. జూన్ మొదటివారంలో కల్వకుర్తి సమీపంలోని బాలాజీ టౌన్‌షీప్ వెంచర్‌లో 30స్తంభాల వైర్, జూలై 12వ తేదీన కొట్ర శివారులో ఉన్న మరో వెంచర్‌లో 70స్తంభాల విద్యుత్ వైర్‌ను చోరీ చేసినట్లు తెలిపారు. విద్యుత్ వైర్‌ను చిన్నచిన్న ముక్కలుగా చేసి పాత ఇనుప సామాను షాపులో విక్రయించినట్లు తెలిపారు. వారిపై మూడు కేసులను నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారినుంచి 750 కేజీల వైరు, రూ.75వేల నగదు, చోరీకి ఉపయోగించిన ట్రాలీఆటో, మహేంద్ర థార్, రెండు ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న రాజు, దినేష్, రమేష్ కోసం గాలిస్తున్నట్లు ఎస్‌ఐ యుగంధర్‌రెడ్డి తెలిపారు. కేసును ఛేదించిన ఎస్‌ఐ, కానిస్టేబుల్ నజీర్, అంజి, నవీన్, కిషోర్‌కుమార్‌రెడ్డిని డీఎస్పీ అభినందించారు.


