● రెవెన్యూ సేవల్లో జాప్యానికి చెక్
● కులం, ఆదాయం, నివాసం తదితర ధ్రువపత్రాల మంజూరుకు కాలపరిమితి
● జాప్యమైతే అప్పీలు చేసే హక్కు
మహబూబ్‌నగర్ రూరల్: కులం, ఆదాయం, నివాసం వంటి ధ్రువపత్రాల కోసం వారాల తరబడి తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులకు ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. ప్రజాసేవల హక్కు (రైట్ టు పబ్లిక్ సర్వీసెస్) చట్టం కింద రెవెన్యూ శాఖలోని కీలక సేవలను చేర్చడంతో ఇకపై మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసే పలు ధ్రువపత్రాలను 20 రోజుల్లోగా జారీ చేయాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులో సేవ అందకపోతే ఉన్నతాధికారులను ఆశ్రయించే హక్కును కూడా ప్రజలకు కల్పించారు. దీంతో రెవెన్యూ సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసిన తర్వాత ఫైలు ఏ దశలో ఉందో తెలుసుకోవడం కష్టంగా ఉండేది. ఒక్కోసారి కార్యాలయాల చుట్టూ పలుమార్లు తిరగాల్సి వచ్చేది. ఇకపై దరఖాస్తు నమోదు నుంచి ధ్రువపత్రం జారీ వరకు ప్రతి దశ ఆన్‌లైన్‌లో నమోదవుతుండటంతో జాప్యానికి బాధ్యులెవరో గుర్తించడం సులభం కానుంది.
జాప్యాలకు అడ్డుకట్టే లక్ష్యం
ప్రతి ఏడాది విద్య, ఉద్యోగాలు, స్కాలర్‌షిప్‌లు, బ్యాంకు రుణాలు, సంక్షేమ పథకాల కోసం వేలాది మంది ధ్రువపత్రాలు పొందుతున్నారు. అయితే సిబ్బంది కొరత, ఫీల్డ్ విచారణల్లో ఆలస్యం, పెండింగ్ ఫైళ్ల కారణంగా అనేక సందర్భాల్లో గడువు దాటుతోంది. దీనివల్ల విద్యార్థులు అడ్మిషన్లు, ఉద్యోగార్థులు దరఖాస్తులు, రైతులు సబ్సిడీ అవకాశాలు కోల్పోయిన ఉదంతాలు ఉన్నాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా ప్రభుత్వం కాలపరిమితిని అమలు చేస్తోంది.
గడువు దాటితే అప్పీల్
నిర్ణీత సమయంలో ధ్రువపత్రం రాకపోయినా, సరైన కారణం లేకుండా దరఖాస్తు తిరస్కరించినా ప్రజలు ఉన్నతాధికారులకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫిర్యాదును పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
అమలుపైనే ఫలితం
ప్రభుత్వం గడువు విధించినా క్షేత్రస్థాయిలో అమలు సమర్థంగా జరిగితేనే ఆశించిన ఫలితాలు కనిపిస్తాయి. కొన్ని మండలాల్లో సిబ్బంది కొరత, పెండింగ్ దరఖాస్తులు, సాంకేతిక సమస్యలు కొనసాగుతున్న నేపథ్యంలో వీటిని అధిగమించాల్సిన అవసరం ఉంది. గడువులో సేవలు అందితే ప్రజల విశ్వాసం మరింత పెరిగే అవకాశం ఉంది.


