గద్వాల/ కొల్లాపూర్ రూరల్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతుంది. ఆదివారం ఎగువ నుంచి 1.60 లక్షల క్యూసెక్కుల వరద రాగా.. స్థానికంగా ఎత్తిపోతల పథకాలకు నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలో భీమా లిఫ్ట్–1కు 1,300 క్యూసెక్కులు, లిఫ్టు–2కు 872, నెట్టెంపాడుకు 750, కోయిల్‌సాగర్‌కు 630, ఎడమ ప్రధాన కాల్వకు 820, కుడి ప్రధాన కాల్వకు 700, సమాంతర కాల్వకు 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
పుష్కరఘాట్ల సమీపంలోకి..
శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. ఆదివారం రాత్రి వరకు సంగమేశ్వరాలయం సగానికి పైగా నీటిలో మునిగిపోగా.. సోమశిల సమీపంలో పుష్కరఘాట్ల వద్దకు నీళ్లు చేరుకున్నాయి. సమీపంలోనే ఉన్న మసీదు సైతం సగానికిపైగా నీటిలో మునిగిపోయింది. జటప్రోల్ సమీపంలోని పురాతన సురభి రాజుల కోట, మసీదు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. నదీ పరవళ్లను తిలకించేందుకు సోమశిల, అమరగిరి, మంచాలకట్ట ప్రాంతాలకు పర్యాటకులు తరలివస్తున్నారు.


