● కోచ్‌లు కావాలని శాట్‌ను కోరిన డీఎస్‌ఏ
● మినీ స్టేడియాల్లో కోచ్‌ల నియామకంపై ప్రతిపాదనలు
● త్వరలోనే నియమించే అవకాశం?
మహబూబ్‌నగర్ క్రీడలు: క్రీడాకారుల సౌకర్యార్థం కోసం, ఇండోర్ గేమ్‌లలో క్రీడాకారులు ప్రతిభ చాటాలనే ఉద్దేశంతో జిల్లాలో ఇండోర్ స్టేడియాలు నిర్మించారు. కోట్లాది నిధులతో మహబూబ్‌నగర్‌లో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో మూడు మినీ స్టేడియాలను ఏర్పాటు చేశారు. నగరంలోని మెయిన్ స్టేడియంలో దాదాపు రూ.7.79కోట్ల నిధులతో అధునాతనమైన క్రీడా సౌకర్యాలతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేశారు. ఈ స్టేడియం ఉమ్మడి జిల్లాలోనే తలమానికంగా నిలుస్తోంది. ఇందులో రెండు ఫ్లోర్‌లలో ఇండోర్ గేమ్‌లు ఆడేలా హాళ్లతో పాటు స్టోర్ రూంలు, క్రీడాకారుల వసతి గదులు ఏర్పాటు చేశారు. అలాగే రెండు వైపుల గ్యాలరీలు, ఆరు బ్యాడ్మింటన్ కోర్టులను ఏర్పాటు చేశారు. జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడాటోర్నీలు నిర్వహించేందుకు ఈ స్టేడియం అన్ని విధాలుగా బాగుంటుంది. ఇటీవల ఫాస్ట్–5 జాతీయస్థాయి సీనియర్ నేషనల్ నెట్‌బాల్, రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్‌తోపాటు సీఎం కప్ రాష్ట్రస్థాయి కబడ్డీ, నెట్‌బాల్ పోటీలు నిర్వహించారు. కాగా.. జిల్లాకేంద్రంలోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో రూ.2కోట్ల 65లక్షలతో, చిన్నచింతకుంట మండలం అల్లీపూర్‌లో రూ.కోటి 59 లక్షలతో ఇండోర్ స్టేడియం, భూత్పూర్ మండలం పోతులమడుగు సమీపంలో రూ.2.65కోట్లతో మినీ స్టేడియం ఏర్పాటు చేశారు.
● జిల్లాలోని నాలుగు ఇండోర్ స్టేడియాల్లో కోచ్‌ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో ప్రస్తుతం ఒక బ్యాడ్మింటన్ కోచ్‌గా ఉండగా బాక్సింగ్, జూడో, టేబుల్ టెన్నిస్ తదితర క్రీడలకు కోచ్‌లు లేరు. అల్లీపూర్‌లోని ఇండోర్ స్టేడియంలో కబడ్డీ, బ్యాడ్మింటన్ కోచ్‌లు ఉండగా ఎంవీఎస్ కళాశాలలోని ఇండోర్ స్టేడియంలో యోగా కోచ్ ఉండగా, పోతులమడుగు సమీపంలోని ఇండోర్ స్టేడియంలో కోచ్‌లు లేరు. మినీ స్టేడియంలతో పాటు జిల్లాలోని ఇతర చోట్ల కోచ్‌ల అవసరాన్ని గుర్తించి ఇటీవలజిల్లా యువజన, క్రీడాశాఖ నుంచి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు ప్రతిపాదనలు పంపారు. కోచ్‌ల నియామకం అయితే ఔత్సాహిక క్రీడాకారులకు మెరుగైన క్రీడా శిక్షణ లభించనుంది. వెంటనే మినీ స్టేడియంతో పాటు ఇతర చోట్ల సరిపడా కోచ్‌ల నియామకం చేపట్టాలని సీనియర్ క్రీడాకారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్టేడియాలు లేకున్నా కొన్ని ప్రాంతాల్లో కోచ్‌లు కావాలని ప్రతిపాధనలు పంపారు. కోడ్గల్‌కు హ్యాండ్‌బాల్, వాలీబాల్, మిడ్జిల్‌కు ఫుట్‌బాల్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాలానగర్‌కు క్రికెట్, వాలీబాల్, కబడ్డీ లేదా ఖోఖో, రాజాపూర్‌కు వాలీబాల్, ఖోఖో క్రీడలకు సంబంధించి కోచ్‌ల ప్రతిపాదనలు పంపారు.
మెయిన్ స్టేడియంలో సాఫ్ట్‌బాల్ ఆడుతున్న క్రీడాకారులు (ఫైల్)


