జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా, ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు కంట్రోల్ రూమ్ నంబరు 08542 241165ను సంప్రదించి సహాయం పొందవచ్చని తెలిపారు. మూడు షిఫ్ట్‌లలో 24 గంటల పాటు సిబ్బంది అందుబాటులో ఉండి, ప్రజల నుంచి వచ్చే కాల్స్‌ను స్వీకరిస్తారని వివరించారు. వర్షాలు, వరదల వల్ల ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే కంట్రోల్ రూమ్ నంబరుకు సంప్రదించి సహాయం పొందవచ్చని కలెక్టర్ సూచించారు.
నేడు రాష్ట్రస్థాయి గోగేమ్ క్రీడాకారుల ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: తెలంగాణ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ గోగేమ్ క్రీడాకారుల ఎంపికలను శుక్రవారం ఉదయం 10.30 గంటలకు జిల్లాకేంద్రంలోని మాస్టర్ మైండ్స్ స్కూల్‌లో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గులాం అఫ్రోజ్, సీనియర్ ఉపాధ్యక్షులు మహ్మద్ షకీల్ అహ్మద్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు తమ ఆధార్‌కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, జిరాక్స్ కాపీలతోపాటు తల్లిదండ్రుల్లో ఒకరి ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురావాలని కోరారు. మిగతా వివరాల కోసం 98857 04173, 98852 42848 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
మొక్కజొన్న అక్రమాలపై ముమ్మర దర్యాప్తు
జడ్చర్ల: బాదేపల్లి సింగిల్ విండో ఆధ్వర్యంలో చేపట్టిన మార్క్‌ఫెడ్ మొక్కజొన్న కొనుగోళ్లలో జరిగిన అవకతవకలు, ఇతర అక్రమాల కు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి సింగిల్‌విండో చైర్మన్ సుదర్శన్‌గౌడ్, సీఈఓ యాద గిరి, గోదాము సిబ్బంది సాధిక్‌లను విచారించినట్లు పేర్కొన్నారు. బాధిత రైతుల స్టేట్‌మెంట్లను కూడా రికార్డు చేశామన్నారు. అయితే మార్క్‌ఫెడ్ కొనుగోళ్ల వివరాలు, రైతులకు చేసిన చెల్లింపుల వివరాలను సేకరించాల్సి ఉందన్నారు. ఇందుకు సంబంధించి ఎస్పీ జానకి అనుమతి తో మార్క్‌ఫెడ్ అధికారులకు లేఖ రాస్తామని సీఐ కమలాకర్ వెల్లడించారు.
జిల్లా యంత్రాంగం
అప్రమత్తంగా ఉండాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. గురువారం ఆయన హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో వీసీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్నిస్థాయిల అధికారులు కార్యస్థానాలు వదిలివద్దని, ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పనిచేస్తున్న హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలని, ఎవరూ సెలవులపై వెళ్లవద్దని ఆదేశించారు. రిజర్వాయర్ల నుంచి వరద ప్రవహించే చుట్టూ ప్రక్కల ప్రాంతాల్లో, కోయిల్‌సాగర్ సమీప ప్రాంతాలలో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండి తగు చర్యలు తీసుకోవాలన్నారు. పీహెచ్‌ిసీలు, సీహెచ్‌సీలలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలకు సేవలు అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. జెడ్పీ సీఈఓ వెంకటరెడ్డి, సీపీఓ రవీందర్, డీఏఓ గోవింద్ నాయక్, ఈఈ దేశ్యానాయక్, డీఎంహెచ్‌ఓ శ్రీనివాసులు పాల్గొన్నారు.
45 రోజులకోసారి
సమావేశాలు తప్పనిసరి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశాలను ప్రతి 45 రోజులకు ఒకసారి నిర్వహించాలని జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం ఈ సమావేశాలకు అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు, మండలస్థాయి అధికారులు, శాశ్వత ఆహ్వానితులు తప్పనిసరిగా హా జరు కావాలని పేర్కొన్నారు. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం నిర్వహించేలా ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలని, అజెండాలోని అన్ని అంశాల పై సమగ్రంగా చర్చ జరిగేలా చూడాలని, సమావేశాల్లో ఆమోదించిన తీర్మానాలపై తదు పరి చర్యలు చేపట్టేలా పర్యవేక్షించాలని సూ చించారు. అలాగే, సమావేశాల సమర్థవంతమై న నిర్వహణకు ఎంపీడీఓలకు అవసరమైన మార్గదర్శకాలు అందించనున్నట్లు తెలిపారు.


