జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, సరఫరాను పూర్తిగా అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్‌లో ఎస్పీ జానకితో కలిసి పాలమూరు యూనివర్సిటీ, ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీ ప్రతినిధులు వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, పోలీసు, ఎకై ్సజ్, విద్యాశాఖ తదితర అధికారులతో నిర్వహించిన నార్కోటిక్స్ అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. డ్రగ్స్ సరఫరా, వినియోగానికి సంబంధించిన ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే తెలియజేయాలని, డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక కంట్రోల్ రూమ్ నంబర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు, హాస్టళ్లలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన పోస్టర్లను తప్పనిసరిగా ప్రదర్శించాలని కలెక్టర్ ఆదేశించారు. పోస్టర్ నమూనాను మూడు రోజుల్లో అందజేస్తామని, అన్ని విద్యాసంస్థలు దానికి అనుగుణంగా అమలు చేయాలని తెలిపారు. విద్యార్థుల్లో డ్రగ్స్ వినియోగానికి సంబంధించిన లక్షణాలను గుర్తించేలా అధ్యాపకులు, వార్డెన్లు, భద్రతా సిబ్బందికి అవగాహన ఉండాలని కలెక్టర్ సూచించారు. హాస్టళ్లలోకి విద్యార్థులు తీసుకువచ్చే బ్యాగులను అవసరమైతే తనిఖీ చేయాలని, రాత్రి వేళల్లో హాస్టల్ గదుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని చెప్పారు.
● డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు సమాచారం అందితే సంబంధిత వ్యక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైతే డీ–అడిక్షన్ కేంద్రాలకు పంపిస్తామని ఎస్పీ డి.జానకి తెలిపారు. ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందిస్తే యువతను మళ్లీ సాధారణ జీవితంలోకి తీసుకురావచ్చన్నారు. డ్రగ్స్ నియంత్రణ అనేది ఒక్క పోలీసు శాఖ బాధ్యత కాదని, ప్రతి పౌరుడు సమాచారం అందించడంలో భాగస్వామి కావాలని కోరారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి, జడ్జి డి.ఇందిర మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగించినట్లు గుర్తించిన విద్యార్థులపై వెంటనే శిక్షాత్మక చర్యలకే పరిమితం కాకుండా, ముందుగా కౌన్సెలింగ్, కుటుంబసభ్యులకు అవగాహన కల్పించడం, అవసరమైతే డీ–అడిక్షన్ కేంద్రాలకు తరలించడం వంటి పునరావాస చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. సమావేశంలో శిక్షణ కలెక్టర్ సాయిశివాని తదితరులు పాల్గొన్నారు.
త్వరలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ నంబర్ ఏర్పాటు
కలెక్టర్ ఖుష్బూ గుప్తా


