నడిగడ్డలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలో 2లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సిన నెట్టెంపాడు ప్రాజెక్టు ద్వారా కేవలం 1.45లక్షల ఎకరాలకే నీరందుతోంది. రెండు దశాబ్దాల క్రితం ప్రారంభించిన ఈ ప్రాజెక్టుకు పదేళ్లుగా నిధులు లేకపోవడంతో పాటు 99, 100 ప్యాకేజీల పరిధిలో 541 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది.
ఎనిమిదేళ్ల క్రితం చేపట్టిన గట్టు ఎత్తిపోతల పథకం కుడి, ఎడమ కాల్వల పరిధిలో 249 ఎకరాలు, రిజర్వాయర్ నిర్మాణానికి మరో 283 ఎకరాలు అవసరం ఉండటంతో పనులు ముందుకు సాగడం లేదు.
ఆర్డీఎస్ ద్వారా 87,500 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా.. అంతర్రాష్ట్ర జలవివాదం కారణంగా వానాకాలంలో గరిష్టంగా 50వేల ఎకరాలకు మించి సాగునీరు అందిన పరిస్థితి లేదు. దీంతో గత ప్రభుత్వం రాజోళి మండలంలో మలమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రిజర్వాయర్ నిర్మాణానికి 567 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా.. స్థానిక రైతులు అభ్యంతరం తెలుపుతుండటంతో పనులకు అడ్డంకిగా మారింది.
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు సైతం వివిధ దశల్లో పెండింగ్‌లోనే కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు కింద సివిల్, మెకానికల్ పనులతో పాటు, భూ సేకరణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు.
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 4.50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉండగా.. రెండు దశాబ్దాలుగా పనులు పెండింగ్‌లోనే కొనసాగుతున్నాయి. ఇక్కడ సుమారు 130 ఎకరాల వరకు భూమిని సేకరించి పనులను పూర్తిచేయాల్సి ఉంది. అసంపూర్తి పనులతో కేవలం 2.50లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది.
భీమా ఎత్తిపోతల పథకం కింద 4 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉండగా.. రెండు దశాబ్దాలుగా పనులు పెండింగ్‌లోనే కొనసాగుతున్నాయి.


