● సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను
పరిశీలించిన కలెక్టర్
పాలమూరు: వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి రెండు నెలల వ్యవధిలో పూర్తి చేయాలని టీఎస్‌ఎంఐడీసీ అధికారులను కలెక్టర్ ఖుష్బూగుప్తా ఆదేశించారు. నగరంలో నూతనంగా నిర్మిస్తున్న వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను బుధవారం ఆమె పరిశీలించారు. మొదట వినియోగదారుల ఫోరం కోర్టు దగ్గరకు వెళ్లి సందర్శించారు. ఫోరం కోర్టు న్యాయమూర్తితో పాటు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనంద్‌రావుతో కలెక్టర్ చర్చించారు. వినియోగదారుల ఫోరం కోసం నూతన భవనం కేటాయిస్తామని, అందులోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పశు సంవర్ధక శాఖ కార్యాలయంతో పాటు గ్రౌండ్ వాటర్ శాఖ కార్యాలయాన్ని పరిశీలించనున్నట్లు తెలిపారు. అనంతరం ఆస్పత్రి ఈ బ్లాక్ పనులు పరిశీలించారు. పార్కింగ్, గార్డెనింగ్, వెయిన్ రోడ్డు, అప్రోచ్ రోడ్డు తదితర పెండింగ్ పనులు పూర్తి చేసి రెండు నెలల్లో ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలన్నారు. శిక్షణ కలెక్టర్ సాయి శివాని, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగా ఆజ్మీరా, డీఈఈ వేణుగోపాల్, ఏఈ శరత్ పాల్గొన్నారు.


