ముంపు బాధితులకు న్యాయం చేస్తాం | - | Sakshi
Sakshi News home page

ముంపు బాధితులకు న్యాయం చేస్తాం

Jul 29 2026 1:34 AM | Updated on Jul 29 2026 1:34 AM

మక్తల్‌: జూరాల వెనుల జలాల కింద ముంపునకు గురైన గ్రామాల ప్రజలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అదుకుంటామని తెలంగాణ రాష్ట్ర సెంటర్‌ కమిషనర్‌ శివకుమార్‌ అన్నారు. మండలంలోని దాదాన్‌పల్లి, అంకెన్‌పల్లి, అనుగొండ గ్రామాలను ఆయన సందర్శించారు. అనంతరం ఆర్‌అండ్‌ఆర్‌ సెంటర్‌ కోసం ఏర్పాటు చేసిన పొలాలను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో ముంపు బాధితులందరూ కలిసి మెలిసి ఉంటే ఏవైనా పనులు సునాయసంగా అవుతాయన్నారు. ప్రభుత్వం తరఫున ఎకరాకు రూ.20 లక్షలు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. 67 ఎకరాలు అంకెన్‌పల్లి, 60 ఎకరాలు దాదన్‌పల్లికి కేటాయించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రాజేందర్‌గౌడ్‌, ఎస్‌డీసీ రవీందర్‌రెడ్డి, ఈఈ గోపాల్‌నాయక్‌, డీఈ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

మృతదేహం లభ్యం

మహబూబ్‌నగర్‌ క్రైం: స్థానిక బండమీదిపల్లి శివారులోని రైల్వే పట్టాల వద్ద మంగళవారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రైల్వే ఎస్‌ఐ రాజు వివరాల మేరకు.. నగరంలోని వీరన్నపేటకు చెందిన భగవంతు (48) చెత్త కాగితాలు సేకరిస్తూ జీవనం సాగిస్తుంటాడు. ఈ క్రమంలో చెత్త సేకరణ కోసం రైలు పట్టాల వెంట వెళ్లిన అతడు.. రైల్వే ట్రాక్‌ దగ్గర అనారోగ్యంతో మృతిచెందాడు. రైల్వే పోలీసులు మృతదేహన్ని జనరల్‌ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

చికిత్స పొందుతూ

ఒకరి మృతి

తిమ్మాజిపేట: మండలంలోని మారేపల్లి గ్రామానికి చెందిన గడమోని ఉత్తస్వామి(58) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు ఎస్‌ఐ శ్రీనివాస్‌రావు తెలిపారు. ఈ నెల 21న గ్రామంలో ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడడంతో మెడ భాగంలో తీవ్ర గాయం అయింది. చికిత్స కోసం కుటుంబ సభ్యులు మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య రాములమ్మ, కుమారుడు ఉన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement