మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటి పతకాలు సాధించాలని జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్య దర్శి జి.శరత్‌చంద్ర అన్నారు. జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో మంగళవారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా పోటీలను శరత్‌చంద్ర జెండా ఊపి ప్రారంభించారు. పోటీలకు జిల్లావ్యాప్తంగా దాదాపు 200 మంది క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. ఎంపియ్యే తుది జట్టును తర్వాత ప్రకటిస్తామని తెలిపారు. హన్మకొండలోని జేఎన్ స్టేడియంలో వచ్చేనెల 7వ తేదీన తెలంగాణ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అండర్–6, అండర్–8, అండర్–10, అండర్–12 ఏళ్లలోపు బాలబాలికలు, జాతీయ జావెలిన్ డే సందర్భంగా అండర్–14, అండర్–16, అండర్–18, అండర్–20 బాల, బాలికలు, పురుషు ల, మహిళల జావెలిన్‌త్రో పోటీలు ఉంటాయని తెలిపారు. జిల్లా అథ్లెట్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్ సంఘం సభ్యులు ఆనంద్, సునీల్, సి.శ్రీనివాసులు, రాజు, పి.శ్రీనివాస్ పాల్గొన్నారు.


