గద్వాల: కృష్ణా బేసిన్‌లో రాష్ట్రంలోనే తొలి ప్రాజెక్టు ప్రియదర్శిని జూరాలకు ఎగువ నుంచి వరద తాకిడి మొదలైంది. కృష్ణమ్మ పరవళ్లను చూసిన అన్నదాతల్లో రేకెత్తిన ఆశలు.. ఎక్కువసేపు నిలవలేదు. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే నిరాశగా మారాయి. ఎగువ ప్రాంతంలోని నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి వరద ఉధృతి తగ్గింది. ఆదివారం రాత్రి 33 వేల క్యూసెక్కుల వరద రాగా.. సోమవారానికి 27 వేల క్యూసెక్కులకు పడిపోయింది. దీంతో వచ్చిన వరద నీటిని జూరాల జలాశయం ఎఫ్‌ఆర్‌ఎల్ 3,018 మీటర్ల వరకు నింపి.. తాగునీటి అవసరాలకు వినియోగించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. వరద జలాలతో వానాకాలంలో పంటలు సాగుచేసుకోవచ్చని ఆశపడిన రైతన్నలకు నిరాశే ఎదురైంది.
అగమ్యగోచరంగా ఆయకట్టు..
వానాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా ఎల్‌నిన్ ప్రభావంతో వరుణుడు మొఖం చాటేశాడు. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా సరైనా వర్షాలు లేక పంట పొలాలు బీడుపడ్డాయి. జూరాల ప్రాజెక్టు ఆయకట్టులో కూడా అదే పరిస్థితి నెలకొంది. గతేడాది మే నెలలోనే వరద జలాలు జూరాలకు చేరగా.. ఈసారి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. వర్షాకాలంలోనూ జూరాల జలాశయం అడుగంటిందంటే.. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో జూరాల ప్రధాన ఎడమ కాల్వ పరిధిలోని 69 వేల ఎకరాలు, కుడి కాల్వ పరిధిలోని 37,400 ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది.
ఆరుతడి పంటల వైపు..
ప్రస్తుత సీజన్‌లో తలెత్తిన ఎల్‌నినో పరిస్థితులను గుర్తించిన అధికారులు.. వానాకాలంలో తక్కువ నీటి వినియోగం ఉన్న పంటలు సాగుచేయాలని రైతులకు సూచిస్తున్నారు. ఆరుతడి పంటలైన మినుములు, పెసలు, చిరుధాన్యాలు, మొక్కజొన్న వంటి పంటల సాగుతో కలిగే లాభాలను వివరిస్తున్నారు. అయితే జూరాల ఆయకట్టులో చాలా వరకు వరిసాగు తప్ప.. ఇతర పంటలను సాగుచేయడానికి రైతులు మొగ్గు చూపడం లేదు.
80 వేల ఎకరాల్లో నారుమళ్లు..
ఏటా వానాకాలంలో జూరాల ఆయకట్టు రైతులు వరిసాగు చేస్తూ వస్తున్నారు. అయితే ఈసారి పరిస్థితులు పూర్తి భిన్నంగా ఏర్పడ్డాయి. అయితే రైతులు మాత్రం వరుణ దేవుడు కరుణించకపోతాడా అన్న ఆలోచనతో యథావిధిగానే వరిపంట సాగుచేసేందుకు సిద్ధమయ్యారు. ఎడమ, కుడి కాల్వల పరిధిలో సుమారు 80 వేల ఎకరాలకు పైగా నారుమళ్లు పోసుకున్నారు. అయితే మూడు రోజులుగా జూరాలకు వరద వచ్చి చేరుతుండటంతో రైతుల్లో ఆశలు రేకెత్తాయి. అయితే రెండు రోజులకే వరద తగ్గిపోవడంతో అన్నదాతల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
ఒక్క పంటకై నా నీరివ్వండి..
ఎడమ కాల్వ పరిధిలో నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. ప్రతిసారి వరిపంట సాగుచేస్తాను. ఈసారి జూరాలకు వరద రాలేదని.. అధికారులు ఆరుతడి పంటలు వేయాలని చెబుతున్నారు. ప్రస్తుతం వరద వచ్చి చేరుతుంది. అధికారులు స్పందించి ఒక్క పంటకై నా నీటిని విడుదల చేయాలి.
– చిన్న ఊశన్న, రైతు, వీపనగండ్ల
వరినారు పోసిన..
కుడి కాల్వ పరిధిలో నాకు పదెకరాల పొలం ఉంది. ఇప్పటికే వరినారు పోసిన. ఇందుకోసం సుమారు రూ.35 వేల పెట్టుబడి అయ్యింది. అధికారులు మాత్రం ఆరుతడి పంటలు సాగుచేయాలంటున్నారు. కానీ, మా పొలంలో వరిపంట మాత్రమే పండుతుంది. ప్రాజెక్టుకు వరద వస్తుండటంతో అధికారులు ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయాలి. – బీచుపల్లి, రైతు, జింకలపల్లి
తాగునీటికే ప్రాధాన్యం..
జూరాలకు మూడు రోజులుగా వరద వస్తోంది. సోమవారం నీటి ప్రవాహం కాస్త తగ్గింది. వరద నీటితో జూరాల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 318 మీటర్ల మేర నింపుతాం. ఈ నీటిని తాగునీటి అవసరాలకే ప్రాధాన్యతనిస్తూ వినియోగిస్తాం. ఆ తర్వాత వచ్చే వరద ప్రవాహం ఆధారంగా పంట పొలాలకు నీరందించాలా.. లేదా అన్నది నిర్ణయించి అవసరమైన చర్యలు తీసుకుంటాం.
– వెంకట్, డీఈ,
జూరాల ప్రాజెక్టు
రెండురోజుల వ్యవధిలోనే జూరాలకు తగ్గిన వరద
ఇప్పటికై తే తాగునీటికే ప్రాధాన్యంఅంటున్న అధికారులు
ప్రశ్నార్థకంగా మారిన
1.9 లక్షల ఎకరాల భూములు
దిక్కుతోచని స్థితిలో ఆయకట్టుదారులు


