పోలీసుల దాష్టీకం.. బెల్టుతో యువకులపై దాడి | - | Sakshi
Sakshi News home page

పోలీసుల దాష్టీకం.. బెల్టుతో యువకులపై దాడి

Jul 27 2026 1:12 AM | Updated on Jul 27 2026 1:12 AM

ధన్వాడ: ట్రాక్టర్‌ డ్రైవర్లపై పోలీసులు బెల్టు ఝులిపించడంతో ఓ యువకుడు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో చోటు చేసుకుంది. మండలంలోని గోటూర్‌ గ్రామస్థులు తెలిపిన వివరాలు.. శనివారం అర్ధరాత్రి సమయంలో గోటూర్‌ శివారులోని కోయిల్‌సాగర్‌ వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని కొందరు డయల్‌ 100 కు ఫోన్‌ చేశారు. దీంతో స్థానిక పోలీసులు రాత్రి 12 గంటల సమయంలో వాగు వద్ద పరిశీలించగా ఒక ట్రాక్టర్‌లో ఇసుక ఉండగా.. మరో రెండు ట్రాక్టర్లు ఖాళీగా ఉన్నాయి. పోలీసులను చూసిన ట్రాక్టర్‌ డ్రైవర్లు అక్కడి నుంచి పారిపోయారు. వాటిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకురావాలని గ్రామ పెద్దలకు చెప్పి పోలీసులు అక్కడి నుంచి వచ్చేశారు. ట్రాక్టర్లను స్టేషన్‌కు తీసుకురాకపోవడంతో ఆదివారం ఉదయం పోలీసులు మరోమారు గ్రామానికి వెళ్లి హెచ్చరించారు. దీంతో రెండు ట్రాక్టర్లను చాకలి నరేశ్‌, కుమ్మరి కుమార్‌ అనే ఇద్దరు యువకులు పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఇంకో ట్రాక్టర్‌ రాలేదని పోలీసులు వారిని ఆరా తీయగా.. నారు వేసేందుకు పొలం వద్దకు వెళ్లిందని, దాని డ్రైవర్‌ రాజవర్ధన్‌ వచ్చాడని, ట్రాక్టర్‌ను సాయంత్రం తీసుకొస్తామని చెప్పారు. దీంతో కోపోద్రిక్తులైన పోలీసులు వారిపై రబ్బర్‌ బెల్టుతో తీవ్రంగా దాడి చేశారు. ఈ క్రమంలో చాకలి నరేష్‌ అనే యువకుడు అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే పక్కనే ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించగా.. యువకుడు కోలుకోకపోవడంతో వెంటనే 108కు ఫోన్‌ చేసి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై ఇన్‌చార్జీ ఎస్‌ఐ మహేశ్వరికి ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ చేసి ఉంది. అనంతరం సీఐ భగంత్‌రెడ్డిని వివరణ కోరగా.. యువకుడికి ఆరోగ్యం ముందు నుంచే సరిగా లేదని, పోలీసులు వారిపై ఎలాంటి దాడి చేయలేదని తెలిపారు. ఘటనపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు.

అనారోగ్యంతో యువకుడు..

గతేడాది చాకలి నరేశ్‌ వ్యక్తిగత కారణాలతో పురుగుల మందు తాగాడు. గమనించి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న యువకుడిని పోలీసులు తీవ్రంగా కొట్టడంతో బీపీ పడిపోయింది. అక్రమంగా ఇసుక తరలిస్తే వారిపై కేసు నమోదు చేయాలి కానీ ఇలా ప్రాణాలు తీసేలా కొడతారా అంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాక్టర్‌ డ్రైవర్లను కొట్టిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement