ధరూరు: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరదతో జలకళ సంతరించుకుంది. వానాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా.. నేటికి జూరాలకు పూర్తిస్థాయిలో వరద రాక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. జూరాల ప్రాజెక్టుకు ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు శనివారం భారీగా వరద వచ్చి చేరుతోంది. నేడో రేపో జూరాలకు వరద వచ్చే అవకాశం ఉంది.
ఆల్మట్టికి భారీగా వరద..
ఎగువన ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది. పైనుంచి 84,888 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. ప్రాజెక్టు నుంచి 67,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 123.08 టీఎంసీలు కాగా ప్రస్తుతం 91.04 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
నారాయణపూర్‌కు వరద జోరు...
నారాయణపూర్‌కు వరద జోరు కొనసాగుతోంది. ఎగువన ఉన్న ఆల్మట్టి నుంచి విడుదల చేసిన 65వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 65 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 43,888 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న జూరాలకు విడుదల చేస్తున్నారు. శనివారం విడుదల చేసిన వరద ఆదివారం సాయంత్రం వరకు జూరాలకు చేరుకునే అవకాశం ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 33.313 టీఎంసీలు కాగా ప్రస్తుతం 17.20 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
జూరాలకు ఇన్ ఫ్లో నిల్...
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వస్తున్న ఇన్‌ఫ్లో ఏమి లేవని పీజేపీ అధికారులు తెలిపారు. ఆవిరి రూపంలో 32 క్యూసెక్కులు, ఇతర అవసరాలకు 512 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 544 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 1.44 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. ఎగువ నుంచి వచ్చే వరద ఆదివారం జూరాలకు చేసుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.


