జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): రాష్ట్ర ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ కింద ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సోలార్ మోడల్ విలేజ్’ (సౌర విద్యుత్ ఆదర్శ గ్రామం) కార్యక్రమంలో భాగంగా గండేడ్ మండలంలోని వెన్నాచేడ్‌లో గృహాలు, వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ విద్యుత్ బిగింపును వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో విద్యుత్ శాఖ, టీజీ రెడ్కో అధికారులతో కలిసి వెన్నాచేడ్‌లో చేపడుతున్న సోలార్ ప్రాజెక్ట్ పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఇంటికి 2 కిలోవాట్ల రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థ, ఆసక్తి ఉన్న రైతుల వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ పంపు వ్యవస్థలను ఉచితంగా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. గ్రామంలో మొత్తం 726 గృహ జ్యోతి విద్యుత్ కనెక్షన్లు ఉండగా.. వాటిలో 261 గృహాలు రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అనువుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారని, వీటిలో ఇప్పటివరకు 116 గృహాల్లో 2 కిలోవాట్ల సామర్థ్యం గల రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటు పూర్తయిందని చెప్పారు. అలాగే 447 వ్యవసాయ మోటార్ కనెక్షన్లు ఉండగా.. 64 మంది రైతులకు 7.5 హెచ్‌పీ సామర్థ్యం గల సోలార్ పంపుసెట్లు అమర్చినట్లు పేర్కొన్నారు. సమావేశంలో రెడ్కో జిల్లా మేనేజర్ మనోహర్‌రెడ్డి, ఫీల్డ్ ఆఫీసర్ భాస్కర్, ట్రాన్స్‌కో ఎస్‌ఈ భీమానాయక్, డీఈ లక్ష్మణ్‌నాయక్, ఏడీఈ సంతోష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


