బాలల రక్షణలో ఉపాధ్యాయులే కీలకం | - | Sakshi
Sakshi News home page

బాలల రక్షణలో ఉపాధ్యాయులే కీలకం

Jul 26 2026 2:50 AM | Updated on Jul 26 2026 2:50 AM

మహబూబ్‌నగర్‌ క్రైం: ప్రభుత్వ పాఠశాలల్లో బాలలకు సురక్షిత వాతావరణం కల్పించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) చైర్‌పర్సన్‌ ప్రేమలత అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్లుగా నియమితులైన ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిర్వహించిన ఒకరోజు సెన్సిటైజేషన్‌ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా నాల్సా పథకం లక్ష్యాలు, బాలల రక్షణలో ఉపాధ్యాయుల బాధ్యత, పాఠశాలల్లో పిల్లలకు భద్రమైన వాతావరణం కల్పించాల్సిన అవసరాన్ని వివరించారు. శిక్షణలో పోక్సో, జువైనెల్‌ జస్టిస్‌, బాల్య వివాహాల నిషేధం, బాల కార్మిక నిషేధం, బాలల హక్కులు, సేఫ్‌ టచ్‌– అన్‌సేఫ్‌ టచ్‌, ఉచిత న్యాయ సహాయం, సైబర్‌ భద్రత, మాదకద్రవ్యాల నివారణ, పిల్లలపై వేధింపుల నిరోధం తదితర అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి ఇందిర, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆనంద్‌రావు, డీఈఓ విజయకుమారి, డీఐఈఓ రమణి, జిల్లా సంక్షేమ అధికారి జరీనాబేగం, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్మన్‌ నయీముద్దీన్‌ పాల్గొన్నారు.

సైబర్‌ మోసాల అడ్డుకట్టకు ప్రత్యేక చర్యలు : ఎస్పీ

మహబూబ్‌నగర్‌ క్రైం: జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న సైబర్‌ నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఎస్పీ జానకి అన్నారు. రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ ఆదేశాల మేరకు శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలు, సైబర్‌ క్రైం, ఐటీ సెల్‌ సిబ్బంది, సైబర్‌ వారియర్స్‌తో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ప్రతి బుధవారం గ్రామాలు, వార్డులు, కాలనీల్లో సైబర్‌ నేరాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సైబర్‌ మోసాలకు గురైన వెంటనే స్పందించడం అత్యంత కీలకమన్నారు. మోసం జరిగిన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్‌ చేసి, నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ (ఎన్‌సీఆర్‌పీ) పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేస్తే గోల్డెన్‌ అవర్‌లో నగదును హోల్డ్‌ చేసి తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. దీనిపై అంశంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రజల సహకారంతోనే సైబర్‌ నేరాలను సమర్థంగా అరికట్టగలమని ఎస్పీ తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఎన్‌.బీ. రత్నం, డీఎస్పీలు, సీఐలు, ఐటీ సెల్‌ సిబ్బంది, సైబర్‌ క్రైమ్‌ అధికారులు, సైబర్‌ వారియర్స్‌ పాల్గొన్నారు.

నేడు బ్యారేజీల పరిశీలన

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: భీమా, కృష్ణానదులపై కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న చెక్‌డ్యాంలు, బ్యారేజీలను బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలతో కలిసి ఆదివారం పరిశీలిస్తామని మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, లక్ష్మారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. హైడ్రాలిక్‌ గేట్లు ఏర్పాటు చేసి తెలంగాణకు నీళ్లు రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా ఆర్డీఎస్‌ వద్ద కర్ణాటక, ఏపీ రాష్ట్రాలు అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారన్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని, కర్ణాటక నుంచి నీరు రాకుంటే తెలంగాణ రైతులు వచ్చే యాసంగిలో పంటలు వేసే పరిస్థితి లేకుండా పోతుందన్నారు. ఈ పరిస్థితి మారే వరకు బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో పోరాటం చేపడుతామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement