
మళ్లీ పెరిగిన వరద ఉధృతి
ధరూరు/ఆత్మకూర్/దేవరకద్ర: ప్రియదర్శిని జూరాల జలాశయానికి శుక్రవారం వరద స్వల్పంగా పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. గురువారం 1.80 లక్షల క్యూసెక్కులు ఉండగా.. శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో 1.95 లక్షల క్యూసెక్కులకు పెరిగిందన్నారు. 24 క్రస్ట్ గేట్లను పైకెత్తి 1,23,768 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నామని.. విద్యుదుత్పత్తి నిమిత్తం 33,403 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 22, నెట్టెంపాడుకు 750, ఎడమ కాల్వకు 390, కుడి కాల్వకు 490 క్యూసెక్కులు వినియోగిస్తున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.261 టీఎంసీలుగా ఉందన్నారు.
వేగంగా విద్యుదుత్పత్తి..
జూరాల దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతుందని ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. శుక్రవారం ఎగువన 6 యూనిట్ల నుంచి 234 మెగావాట్లు, 258.622 మి.యూ, దిగువన 6 యూనిట్ల నుంచి 240 మెగావాట్లు, 289.916 మి.యూ. విద్యుదుత్పత్తి చేపట్టినట్లు వివరించారు. ఇప్పటి వరకు 547.538 మి.యూ. ఉత్పత్తి సాధించామని చెప్పారు.
కోయిల్‌సాగర్ 2 గేట్లు తెరిచి..
శుక్రవారం కోయిల్‌సాగర్ జలాశయం రెండు గేట్లు ఎత్తి 1,200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. గురువారం వరద తక్కువగా ఉండటంతో ఒక గేటు తెరిచామని.. శుక్రవారం ఉదయం పెరగడంతో మరో గేటు ఎత్తినట్లు వివరించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా.. ప్రస్తుతం 32 అడుగులు ఉందన్నారు.
జూరాల 24 గేట్లు ఎత్తి దిగువకు విడుదల