
కేసులను పారదర్శకంగా విచారణ జరపాలి
అడ్డాకుల: పోలీస్ స్టేషన్లలో నమోదయ్యే కేసులను విచారణ అధికారులు పారదర్శకంగా విచారణ జరిపి నిందితులకు శిక్ష పడే విధంగా పని చేయాలని ఎస్పీ డి.జానకి అన్నారు. మండలకేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. కేసులకు సంబంధించిన రికార్డులు, ఫైళ్ల నిర్వాహణపై ఆరా తీశారు. రౌడి షీటర్లు, సస్పెక్ట్ షీట్లు, ఇసుక అక్రమ రవాణా, ఇతర అక్రమ కార్యకలాపాలపై నిఘా ఉంచాలని సిబ్బందికి సూచించారు. సిబ్బంది సేవలపై ఆరా తీసి సమస్యలను తెలుసుకున్నారు. విధుల విభజన ప్రకారం ప్రజలకు సమర్థవంతంగా సేవలందించాలని, ఠాణాకు వచ్చే వారితో మర్యాదపూర్వకంగా మెలగాలని సూచించారు. అనంతరం ఠాణా ఆవరణలో మొక్క నాటి నీళ్లు పోశారు.
ప్రమాదాల నివారణపై దృష్టి సారించాలి
అడ్డాకుల పోలీస్ స్టేషన్ పరిధిలో 44వ నంబర్ జాతీయ రహదారి విస్తరించి ఉన్నందున రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ప్రమాదాల నివారణపై పోలీసులు దృష్టి సారించాలని ఎస్పీ జానకి సూచించారు. రోడ్డు భద్రతా చర్యలపై పోలీసులు ప్రజలను చైతన్యం చేసే విధంగా చూడాలని చెప్పారు. లైసెన్స్, హెల్మెట్ లేకుండా, మద్యం మత్తులో బైకులను నడిపే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. హైవేపై పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలన్నారు. అనంతరం మూసాపేట మండలం వేముల ఎస్‌జీడీ ఫార్మా పరిశ్రమ వద్దకు వచ్చే నెల 3న సీఎం రేవంత్‌రెడ్డి రానున్న నేపథ్యంలో కంపెనీని ఎస్పీ సందర్శించారు. అలాగే మూసాపేటలో ఇందిరమ్మ ఇళ్లను ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేసే అవకాశం ఉన్నందున చివరి దశ పనులు జరిగే ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఎస్పీ వెంట డీఎస్పీ వెంకటేశ్వర్లు, భూత్పూర్ సీఐ రామకృష్ణ, అడ్డాకుల, మూసాపేట ఎస్‌ఐలు శ్రీనివాస్, వేణు తదితరులు పాల్గొన్నారు.