
స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించాలి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: దివిటిపల్లిలోని అమరరాజా గిగా ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి డిమాండ్ చేశారు. శుక్రవారం సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సుమారు 500 మందిలో 74 మంది మాత్రమే స్థానికులు ఉన్నారన్నారు. మిగిలిన వారంతా యూపీ, బిహార్, ఒడిశా, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు చెందిన వారేనన్నారు. జడ్చర్ల – పోలేపల్లి సెజ్ మొదలుకుని జిల్లాలోని అనేక పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, షాపింగ్ మాల్స్‌లో వేలాది మంది వలస కార్మికులను యాజమాన్యాలు పనిలో పెట్టుకుని వేతనాలు సరిగ్గా చెల్లించడం లేదని ఆరోపించారు. ముఖ్యంగా పీఎఫ్, ఈఎస్‌ఐ, బోనస్, గ్రాడ్యుటీతో పాటు కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. వెంటనే కార్మిక, పరిశ్రమల, పీఎఫ్ అధికారులు సంయుక్తంగా విచారణ జరిపి కార్మికులకు న్యాయం చేయాలన్నారు. అనంతరం కలెక్టరేట్ ఏఓ సువర్ణరాజ్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు దీప్లానాయక్, నాయకులు కమర్‌అలీ, వేణుగోపాల్, గోనెల రాములు, రాజ్‌కుమార్, వెంకటేష్‌గౌడ్, నారాయణ, నరసింహ తదితరులు పాల్గొన్నారు.