
‘స్థానిక’ ఎన్నికలకు పార్టీలు సహకరించాలి
● అఖిల పక్ష పార్టీల సమావేశంలోకలెక్టర్ విజయేందిర
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): స్థానిక సంస్థల ఎ న్నికలకు వివిధ రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ విజయేందిర విజ్ఞప్తి చేశారు. శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఓటర్ లిస్టు, ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల ప్రతినిధులు పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు జాబితా ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్లు తెలిపారు. అందులో ఏమైన అభ్యంతరాలు ఉంటే ఈనెల 30వ సాయంత్రం లోపు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో లిఖిల పూర్వకంగా తెలియజేయాలన్నారు. ఎంపీడీఓలు వాటిని పరిశీలించి.. తగు సవరణలు చేసి తుది జాబితా ప్రచురణ కోసం జిల్లా పంచాయతీ అధికారి సమర్పించాలన్నారు. సెప్టెంబర్ 2వ తేదీన వార్డు వారీగా తుది ఫొటో ఓటర్ జాబితాను ప్రచురించనున్నట్లు తెలిపారు. చనిపోయిన వారి ఓట్లు, దొంగ ఓట్ల తొలగించేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఒక వార్డులోని ఓటు మరో వార్డులో ఉంటే వాటిని వెంటనే తెలియ జేయాలన్నారు. వార్డులు వారీగా, గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా షెడ్యూల్‌పై అవగాహన కల్పించారు. మండలస్థాయిలో శనివారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డీపీఓ పార్థసారధి, బీఆర్‌ఎస్ పార్టీ ప్రతినిధులు బెక్కం జనార్దన్, సత్యంయాదవ్, కాంగ్రెస్ ప్రతినిధి సిరాజ్‌ఖాద్రి, వైఎస్‌ఆర్‌సీపీ ప్రతినిధి శ్యాముల్, బీజేపీ రాజేశ్వర్‌రెడ్డి, సీపీఎం మోహన్ పాల్గొన్నారు.