
అమ్రాబాద్‌కు సాగునీరు ఇవ్వండి
మన్ననూర్: చంద్రసాగర్ నుంచి ఎత్తిపోతల ద్వారా ఉమ్మడి అమ్రాబాద్ మండలానికి సాగునీరు అందించాలని పాలమూరు అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్ రాఘవాచారి అన్నారు. శుక్రవారం అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలోని అంబేడ్కర్ కూడలిలో ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి గురించి మాట్లాడాలంటే కూడా ధైర్యం కావాలని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి చెప్పిన మాటలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. పాలమూరు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఆ ధైర్యం లేకనే జిల్లా ఇప్పటి వరకు కూడా వెనుకబాటుకు గురవుతూనే ఉందని విమర్శించారు. తొమ్మిదిన్నరేళ్లు తెలంగాణను పాలించిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం మూడేళ్లలో రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం నిర్మించింది.. కానీ, అమ్రాబాద్ మండలంలోని సుమారు 30 వేల ఎకరాలకు సాగునీరు అందించడంలో అప్పటి బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు కపట ప్రేమ ఒలక బోస్తున్నాయని దుయ్యబట్టారు. గతంలో చేసిన ప్రతిపాదనలను నల్లగొండ జిల్లా మంత్రులు వారి స్వార్థ రాజకీలకు వాడుకున్నారని ఎద్దేవా చేశారు. డిండి, ఎస్‌ఎల్‌బీసీ, ఎలిమినేటి మాధవరెడ్డి ఎడమకాల్వ ద్వారా పూర్తిగా నీటిని దేవరకొండ, మునుగోడు ప్రాంతాలకు తరలించుకెళ్లి నల్లగొండను సస్యశ్యామలం చేసుకోవాలనుకుంటున్నారన్నారు. నల్లగొండ మంత్రులు అనుకున్నట్లుగా ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచిస్తే చంద్రసాగర్ నుంచి సుమారు 10 కి.మీ. దూరంలోనే అమ్రాబాద్ మండలంలోని పొలాల్లో నీళ్లు పారుతాయని చెప్పారు. సమావేశంలో నియోజకవర్గం కన్వీనర్ గాజుల లక్ష్మీనారాయణ, అంబేడ్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు బాలకిష్టయ్య, స్వామి, అధ్యయన వేదిక కల్వకుర్తి కన్వీనర్ అశోక్, మోహన్, నిరంజన్, చెన్నయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.