హత్య కేసులో ఆరుగురి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

హత్య కేసులో ఆరుగురి అరెస్టు

Aug 30 2025 7:23 AM | Updated on Aug 30 2025 7:23 AM

హత్య కేసులో ఆరుగురి అరెస్టు

హత్య కేసులో ఆరుగురి అరెస్టు

పెద్దకొత్తపల్లి: కోడేరు మండలం మైలారం గ్రామానికి చెందిన అనుముల రంగస్వామి హత్య కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నాగర్‌కర్నూల్‌ డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం పెద్దకొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో హత్యకేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అనుముల రంగస్వామికి అచ్చంపేటలో నివాసముంటున్న పులేందర్‌గౌడ్‌ అలియాస్‌ పుల్లయ్యగౌడ్‌తో కొంతకాలం క్రితం పరిచయమైంది. ఇరువురు కలిసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేవారు. ఈ క్రమంలోనే తనకు తెలిసిన చోట గుప్తనిధులు ఉన్నాయని.. వాటిని వెలికితీసేందుకు స్మామిజీ ఉన్నాడని.. డబ్బులు ఇస్తే గుప్తనిధులు తీసిస్తాడని రంగస్వామి పులేందర్‌గౌడ్‌కు చెప్పడంతో రూ. 5లక్షలు ఇచ్చాడు. అయితే గుప్తనిధులు ఇవ్వకపోగా.. మరో రూ. 5లక్షలు ఇవ్వాలని రంగస్వామి డిమాండ్‌ చేశాడు. అందుకు పులేందర్‌గౌడ్‌ నిరాకరించాడు. అయితే స్వామిజీ కన్నెర్రజేస్తే నివ్వు, నీ కుటుంబం మాడి మసైపోతారని భయపెట్టడంతో రంగస్వామిని ఎలాగైనా హతమార్చాలని పులేందర్‌గౌడ్‌ పథకం రచించాడు. ఈ మేరకు జూలై 29న డబ్బులు ఇస్తానని రంగస్వామిని జడ్చర్లకు పిలిపించుకున్నాడు. అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌కు తీసుకెళ్లి తన తమ్ముడు సలేశ్వరంగౌడ్‌ ఇంట్లో చికెన్‌లో మత్తు మందు కలిపి రంగాస్వామికి తినిపించారు. సృహ కోల్పోయిన రంగాస్వామిని రమేశ్‌ అనే వ్యక్తి వాహనంలో ఎక్కించుకొని బల్మూర్‌ మండలం మైలారం గ్రామంలోని మామిడితోటకు తీసుకెళ్లాడు. అప్పటికే తోటలో పనిచేసే రమేశ్‌ తండ్రి గోతి తీసి ఉంచగా.. అందులో రంగాస్వామిని పడేశారు. ఈ క్రమంలోనే సృహలోకి వచ్చిన రంగాస్వామిని శివ గడ్డపారతో తలపై రెండసార్లు బలంగా మోదడంతో మృతిచెందాడు. మృతదేహంపై ఉప్పు, మట్టి వేసి పూడ్చివేశారు. నిందితులు అక్కడే మద్యం తాగి ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. అయితే రంగస్వామి అదృశ్యమైనట్లు ఈ నెల 4న అతడి భార్య అరుణ ఫిర్యాదు మేరకు పెద్దకొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కాల్‌ డేటా ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించి తమదైన శైలిలో విచారించడంతో చేసిన నేరాన్ని అంగీకరించారు. నిందితులు పులేందర్‌గౌడ్‌, శివ, కర్ణాటి సుధాకర్‌, జక్కుల తిరుపతయ్య, పలుస భాస్కర్‌గౌడ్‌లను అరెస్టు చేయగా.. రమేశ్‌ అనే నిందితుడు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. నింధితుల నుంచి 6 సెల్‌ఫోన్లు, రెండు గడ్డపారాలు, ఒక పార, తుఫాన్‌ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో కొల్లాపూర్‌ సీఐ మహేశ్‌, ఎస్‌ఐలు సతీష్‌, జగదీశ్వర్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement