
నల్లమలలో దారితప్పిన ఇద్దరు వ్యక్తులు
లింగాల: మండలంలోని అప్పాయపల్లి అటవీ ప్రాంతంలో దారితప్పిన ఇద్దరు వ్యక్తులను ఫోన్ లొకేషన్ ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు రక్షించిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ వెంకటేశ్వర్‌గౌడ్ కథనం ప్రకారం.. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లి గ్రామానికి చెందిన జంపయ్య, వెంకటస్వామి గొర్రెలకు సోకే వ్యాధులకు అవసరమైన చెట్ల మందు పసరు కోసం గురువారం ఉదయం లింగాల మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతానికి వెళ్లారు. వారు మధ్యాహ్న సమయంలో అప్పాయపల్లి, గిరిజ గుండాల ప్రాంతంలో దారి తప్పారు. దారి తప్పినట్లు గుర్తించిన వారు రాత్రి 7 గంటల సమయంలో అప్పాయపల్లిలో ఉన్న బంధువు మొగిలి నిరంజన్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఫోన్ చేసిన ప్రాంతంలోనే ఉండాలని అక్కడి నుంచి కదలవద్దని నిరంజన్ చెప్పి వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్లు ఎస్‌ఐ తెలిపారు. పలువురు అప్పాయపల్లికి చెందిన గ్రామస్తులతో కలిసి లొకేషన్ ఆధారంగా వారిని గుర్తించారు. తప్పిపోయిన ఇద్దరు వ్యక్తులు బాణాల సమీపంలోని రుసుల్ చెర్వు అలుగు వెళ్లే వాగు దగ్గర రాత్రి 12 గంటలు అయినప్పటికీ అక్కడే ఉన్నారు. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడం గమనించి అవతలి గట్టుపై ఉన్న వారికి తాడును అందించగా వారు దానిని పట్టుకొని ఇవతలికి వచ్చారు. గ్రామస్తులు సకాలంలో సమాచారం ఇవ్వడంతో వారికి ఎలాంటి అపాయం జరగలేదని ఎస్‌ఐ తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది రాములు, హుస్సేన్, ప్రజలు మొగిలి నిరంజన్, కృష్ణ, చందర్, సంతోష్, రాజు, రవి తదితరులు పాల్గొన్నారు.
ఫోన్ లొకేషన్ ఆధారంగా రాత్రి
12 గంటల సమయంలో రక్షించిన పోలీసులు