
వృద్ధుడి దారుణ హత్య
● ఘటన స్థలాన్ని పరిశీలించిన వనపర్తి ఎస్పీ
● ఆధారాల కోసం క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్ అన్వేషణ
పాన్‌గల్: వనపర్తి జిల్లా పాన్‌గల్‌లో గురువారం ఎనుముల కిష్టయ్య (65)ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కుంటి కిష్టయ్య గొర్రెల బేరం చేస్తూ ఒంటరిగా జీవనం సాగిస్తుండేవాడు. బుధవారం బోనాల పండుగ సందర్భంగా గ్రామంలోని పెద్ద కోడలు వెంకటమ్మ ఇంటికెళ్లి భోజనం చేయగా ఫోన్ రావడంతో బయటకు వెళ్లాడు. రాత్రి ఇద్దరు వ్యక్తులు బైక్‌పై తీసుకొచ్చి ఇంటి వద్ద వదిలారు. ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు లోనికి ప్రవేశించి పప్పుగుత్తి, పదునైన ఆయుధంతో ముఖం, చేతులు, ఛాతిపై దాడి చేయడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. గురువారం ఉదయం అటుగా వెళ్తున్న ఓ మహిళ ఇంటి తలుపులు తెరిచి ఉండటం, కోతులు లోనికి వెళ్తుండటం చూసి పిలువగా ఎలాంటి స్పందన లేకపోవడంతో తలుపు దగ్గరకు వెళ్లి చూసింది. మంచంపై కిష్టయ్య ఎలాంటి కదలిక లేకుండా ఉండటంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. ఇద్దరు వ్యక్తులపై అనుమానం ఉన్నట్లు చిన్న కుమారుడు శివయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కృష్ణ వివరించారు. అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. ఘటనా స్థలాన్ని క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు ఆధారాలు సేకరించారు.
● ఎస్పీ రావుల గిరిధర్ ఘటనా స్థలాన్ని, ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలు, చుట్టుపక్కల పరిస్థితులను సిబ్బందితో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు. వివరాలు సేకరించి పలు సూచనలు చేశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేస్తున్నామని.. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. ఆయన వెంట డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ కృష్ణ, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, ఎస్‌ఐ శ్రీనివాసులు, సిబ్బంది ఉన్నారు.

వృద్ధుడి దారుణ హత్య